దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశం పట్టించుకోని మున్సిపల్ అధికారులు
రాయికల్: పట్టణంలో ఖాళీస్థలాలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. రాయికల్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు బల్ది యాలో స్థలాలు కొనుగోలు చేసి వదిలివేయడంతో వాటిలో చెట్లు పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం, డ్రైనేజీలోకి చేరడంతో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పట్టణంలో పర్యటించిన కలెక్టర్ సత్యప్రసాద్ ఖాళీస్థలాలు అపరిశుభ్రంగా, పిచ్చిమొక్కలతో నిండి ఉన్నా వెంటనే సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజును ఆదేశించినప్పటికీ ఆచరణలోకి మాత్రం రావడం లేదు. పట్టణంలోని భీమన్నవాడ, కేశవనగర్, ప్రభుత్వ ఆస్పత్రి ఏరియా, మాదిగకుంట, కోరుట్ల క్రాసింగ్‌రోడ్ తదితర కాలనీల్లో ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో విష పురుగులు, పాములు తిరుగుతున్నాయి. అపరిశుభ్రంగా ఉన్న స్థలాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. అయినా మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు.
కొరవడిన పర్యవేక్షణ
స్థల యజమానులు ఎప్పటికప్పుడు పరిశుభ్రత చర్యలు చేపట్టాలి. కానీ కొందరు రిజిస్ట్రేషన్ చేయించుకుని వదిలేస్తున్నారు. దీంతో ఆ స్థలాలు మురికికూపాలుగా మారుతున్నాయి. సంబంధిత యజమానులకు అధికారులు అప్పుడప్పుడు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ పట్టణంలో కొందరి వివరాలు తెలియక మున్సిపల్ అధికారులు నోటీసులు సైతం ఇవ్వడం లేదు. ఖాళీ స్థలం ఉంటే పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అసలు బల్దియా పరిధిలో ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయో మున్సిపల్ అధికారుల వద్ద వివరాలు లేవు.


