జగిత్యాలరూరల్: నిరక్షరాస్యత నిర్మూలనకు మహిళా సంఘాల ద్వారా కృషి చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రఘువరణ్ తెలిపారు. ఆదివారం ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలంతోపాటు గొల్లపల్లెలో మహిళలకు నిర్వహించిన పరీక్షను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువురాని మహిళలను ముందుగా గ్రామసంఘాల సహాయకుల ద్వారా గుర్తించి వారికి సాయంత్రం పూట అక్షరాలు నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆయా పాఠశాలల్లో పరీక్ష నిర్వహించామన్నారు. జిల్లాలో దాదాపు 22 వేల మంది మహిళలు ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొన్నారన్నారు. విద్యాశాఖ సహకారంతో అన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామైక్య సభ్యులు, వీవోఏలు, సీసీలు, ఏపీఎంలు పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా అదనపు ప్రాజెక్ట్ అధికారి పి.సునీత, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి మండల కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఐబీ ఏపీఎం ఓదెల గంగాధర్, ఏపీఎం రమాదేవి, సీసీలు మహేశ్, గంగారాం, గంగాధర్, ఆయా మండలాల అధ్యక్షురాలు, గ్రామ సమైక్య అసిస్టెంట్లు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


