ఫొటోలు తీసి.. బ్లాక్‌ మెయిల్‌ చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

ఫొటోలు తీసి.. బ్లాక్‌ మెయిల్‌ చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు

Mar 27 2026 9:15 AM | Updated on Mar 27 2026 9:15 AM

ఫొటోలు తీసి.. బ్లాక్‌ మెయిల్‌ చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు

జగిత్యాలజోన్‌: ఓ వివాహిత తన ఇంట్లో స్నానం చేస్తుండగా.. చాటుగా ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిలింగ్‌ చేసి.. ఆమెను శారీరకంగా లోబర్చుకున్న కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.6,600 జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బిట్ల నర్సయ్య కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు. తన భర్తకు స్నేహితుడైన అదే మండలం నర్సాపూర్‌కు చెందిన నరేండ్ల మహేందర్‌ అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. మహేందర్‌ ఓ రోజు ఇంటికి వచ్చిన సమయంలో మహిళ స్నానం చేస్తోంది. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియా తీసి.. ఆమె భర్తకు ఆమె గురించి చెడుగా చెప్పాడు. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మహిళ పుట్టింటికి చేరింది. దీంతో మహేందర్‌ తన ఫోన్లో ఉన్న మహిళ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. 2022 ఏప్రిల్‌ 19న కూడా రాత్రి సమయంలో వచ్చి వీడియోలు తొలగిస్తానని చెప్పి మళ్లీ శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీడియోలు తీసేయమంటే, తాను అడిగినప్పుడల్లా కోరిక తీర్చాల్సిందేనని బెదిరించాడు. దీంతో సదరు మహిళ తనకు జరుగుతున్న అన్యాయాన్ని గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్‌ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడైన మహేందర్‌ను అరెస్ట్‌ చేసి..కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు ఎం.కిరణ్‌కుమార్‌, బి.రాజు, వి.శ్రీధర్‌ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో పరిశీలించిన అనంతరం మహేందర్‌కు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.6,600 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement