జగిత్యాలక్రైం/రాయికల్/రుద్రంగి: జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన తాపీమేసీ్త్ర రమణయ్య, ఆయన వద్ద పనిచేస్తున్న మనోహర్, ప్రభావతి, రాయికల్ మండలం అయోధ్యతోపాటు రామారావుపల్లికి వలస వచ్చిన ఉప్పు రమాదేవి, రుద్రంగిలో తాపీమేస్తీగా పనిచేస్తున్న దేవండ్ల రామయ్య, దుబ్బాల రత్తమ్మ, అయోధ్యలో తాపీమేసీ్త్ర వద్ద పనిచేస్తున్న దుబ్బాల కిరణ్, పునుగోటి వెంకటేశ్ శ్రీరామనవమి సందర్భంగా వారివారి స్వగ్రామాలకు హరికృష్ణ ట్రావెల్స్‌లో బుధవారం సాయంత్రం 4.30గంటలకు బయల్దేరారు. వీరిలో ప్రభావతి, రమాదేవి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు. ఘటనలో దేవండ్ల రామయ్య కూడా మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
చిట్టి డబ్బులు కట్టేందుకు..
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దాసరవెల్లికి చెందిన వెంకటేశ్, కిరణ్ అయోధ్యలో పోలయ్య తాపీమేసీ్త్ర వద్ద రెండు నెలలుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తాము తీసుకున్న చీటీ డబ్బులు చెల్లించేందుకు పోలయ్య భార్య రత్తమ్మతో కలిసి బయల్దేరారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌కు భార్య, కుమారుడు, కూతురు సంతానం. రత్తమ్మ, కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు.
కొడుకును కాపాడి.. తల్లి సజీవదహనం
మార్కాపురం జిల్లా కనిగిరి మండలం మాడాదివరిపల్లికి చెందిన ఉప్పు మాలాద్రి భార్య రమాదేవి, కొడుకు మనోహర్‌తో కలిసి ఆరేళ్లుగా రామారావుపల్లిలో మేసీ్త్రగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం రమాదేవి కుమారుడితో కలిసి బయల్దేరింది. బస్సులో మంటలు చెలరేగగానే.. రమాదేవి కొడుకును బయటకు తోసేసింది. అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడడంతో రమాదేవి కాలిబూడిదైనట్లు మనోహర్ విలపిస్తూ చెప్పాడు.
రామయ్య కుటుంబసభ్యుల్లో ఆందోళన
కాలి బూడిదైన బస్సులో రుద్రంగికి వలస వచ్చిన తాపీమేసీ్త్ర దేవాండ్ల రాములు ఉండడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన రాములు నాలుగేళ్లుగా రుద్రంగిలో భవన నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ప్రమాదం జరగడానికి 10 నిమిషాల ముందు కుమారుడు వేణుతో ఫోన్లో మాట్లాడాడని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బస్సు దగ్ధమై మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో బూడిదవడంతో మృతి చెందాడా..? లేదా..? అన్నది డీఎన్‌ఏ ఆధారంగా నిర్ధారిస్తామని పోలీసులు తెలిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.


