సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్‌కు చెందిన లక్కీ మిరానీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గుర్తింపు పొందుతున్నాడు. బాల్యంలోనే చూపు కోల్పోయినప్పటికీ, సంకల్పం, క్రమశిక్షణతో చీకటిని జ్ఞాన వెలుగుగా మలచుకుంటూ తనదైన శైలిలో మన్ననలు పొందుతున్నాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడుతున్న దృష్టి లోపం గల యువకుడిగా లక్కీ మిరానీ రికార్డు సాధించాడు. మిరానీ 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్‌లో 95.80శాతం మార్కులు సాధించాడు. యూజీసీ ఎంట్రెన్స్‌లో ఆలిండియా 1వ ర్యాంక్ సాధించి, తొలి ప్రయత్నంలోనే యూజీసీ నెట్ క్లియర్ చేశాడు. చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తన ప్రతిభ చాటాడు. గోల్‌బాల్ క్రీడలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. లక్కీ విజయాల వెనుక అతని తల్లిదండ్రులు దీపక్ మిరానీ, ముస్కాన్ మిరానీ నిలవడం విశేషం. ప్రస్తుతం పాలిటికల్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్కీ, భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్‌లో సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.


