కౌంట్‌డౌన్..
జగిత్యాల: మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సోమవారంతో ప్రచార గడువు కూడా ముగియనుంది. సాయంత్రం నుంచి మైకులు బంద్ కానున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు కార్నర్ మీటింగ్‌లు, సభలతో హోరెత్తించారు. ఈనెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్నిపార్టీలు చివరి దశలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ప్రతి ఓటు కీలకం కావడంతో పోల్ మేనేజ్‌మెంట్ ప్రకారం ఓట్లు ఎలా రాబట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే గల్లీగల్లీ తిరిగిన అభ్యర్థులు, నాయకులు చివరిరోజు తీసుకునే నిర్ణయాలే గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలోననే ప్రయత్నాల్లో అభ్యర్థులు ఉన్నారు.
కార్నర్ మీటింగ్‌లు.. సభలు
పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వం హోరెత్తింది. ఒకవైపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అభ్యర్థులతో కలిసి కార్నర్ మీటింగ్‌లు నిర్వహించడంతో సందడి నెలకొంది. అభ్యర్థుల మద్దతుగా పార్టీల అగ్రనేతలు రావడంతో రాజకీయ వేడి రాజుకుంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులో ప్రతి ఓటరును కలవాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు జనసమీకరణ చేపట్టి ఒకేచోట 5నుంచి 6 వార్డులు కవర్ అయ్యేలా ప్రచారం నిర్వహించారు. తమను గెలిపస్తే చేసే పనులను హామీల రూపంలో గుమ్మరించారు. అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు అభివృద్ధికే పట్టం కట్టాలని, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని ముందుకెళ్లింది. కేంద్రప్రభుత్వం నుంచే నిధులు వస్తాయని, వాటితోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని బీజేపీ ప్రచారం చేసింది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు చెబుతూ ముందుకెళ్లారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కావడం లేదంటూ ప్రచారం చేసింది. ప్రజలు ఒకసారి ఆలోచించాలని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అన్ని ఇబ్బందులే ఉంటాయని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
నేటితో ముగియననున్న ప్రచారం
రోడ్‌షోలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు
కార్నర్ మీటింగ్‌లతో హామీలు, ప్రకటనలు
ఈనెల 11న మున్సిపల్ పోలింగ్


