బీజేపీని ఆశీర్వదించండి
రాయికల్: మున్సిపాలిటీల్లో బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాయికల్ బల్దియాలో పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, బల్దియాలో కూడా బీజేపీని గెలిపిస్తేనే నిధులు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోవడంలేదని, మరోసారి నమ్మి ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చిన ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, రేషన్ బియ్యం, ఆరోగ్య బీమా, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో బీజేపీలో పనిచేసి.. బీఆర్‌ఎస్‌లో చేరిన తురగ శ్రీధర్‌రెడ్డిని తిరిగి బీజేపీలో చేరారని కోరడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు బోగ శ్రావణి, పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, పడాల తిరుపతి పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్..కాంగ్రెస్ మోసం చేస్తున్నాయి
కోరుట్ల: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఎంపీ అర్వింద్ అన్నారు. కోరుట్లలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం, స్కూటీలు, పింఛన్ల పెంపు, రైతు భరోసా హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల సొమ్మును కాజేసిందన్నారు. ప్రధాని మోదీ కరోనా సమయంలో వ్యాక్సిన్లు, ఆరోగ్యబీమా, సడక్ యోజన, అమృత్ వంటి పథకాలు అందించారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ను గద్ద ముక్కోడు అని, సీఎం రేవంత్‌రెడ్డిని పొట్టోడు.. అని ఎంపీ మాట్లాడడం గమనార్హం.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఏ పార్టీ..?
రాయికల్ బల్దియాపై బీజేపీ జెండా ఎగరాలి
ఎంపీ ధర్మపురి అర్వింద్


