డిజిటల్ సర్వే
జిల్లాలో ఎంపికై న గ్రామాలివే..
జగిత్యాల: భూవివాదాలు తొలగించేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వే ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని బీర్‌పూర్ మండలం కోమన్‌పల్లిని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. నక్షలేని ఈ గ్రామంలో పూర్తిస్థాయిలో సర్వే చేసి భూములకు హద్దులు గుర్తించారు. అలాగే నక్ష ఏర్పాటు చేసి సర్వేనంబర్లను కేటాయించారు. ఇది విజయవంతం కావడంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద మరో 20 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ డిజిటల్ సర్వే ద్వారా భూమి వివరాలు స్పష్టంగా నమోదు కావడంతో రైతులకు భవిష్యత్‌లో ఎలాంటి వివాదా లు లేకుండా పారదర్శకంగా ఉంటుంది. రెవెన్యూ వ్యవస్థలోనూ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
వివాదాలకు చెక్
డిజిటల్ సర్వే కోసం ముందుగా 70 గ్రామాలను ఎంపిక చేసినప్పటికీ మొదటగా నక్ష లేని 20 గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. ఈ డిజిటలైజేషన్‌లో భాగంగా గ్రామాల్లోని భూములకు హద్దులు గుర్తించనున్నారు. తద్వారా భూ వివాదాలు చెక్ పడనుంది. గ్రామంలో ఏ సర్వే నంబర్‌లో ఎలాంటి భూములున్నాయి..? అసైన్డ్ భూములెన్ని..? గ్రామకంఠం, చెరువులు, కుంటలు వీటన్నింటిని పూర్తిస్థాయిలో గుర్తించి సర్వే నంబర్లు ఇస్తారు. ఒక రైతు భూమిలో ఎక్కువ సర్వేనంబర్లు ఉండడం ద్వారా రికార్డులో ఉన్న భూమికి.. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలు వచ్చి గొడవలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎలాంటి సమస్యలు లేకుండా నక్ష లేని ఈ గ్రామాల్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో గుర్తించి సర్వేనంబర్లను బట్టి మ్యాప్ తయారుచేస్తారు. ఈ సర్వేకు డ్రోన్ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలు వినియోగిస్తున్నారు. రైతులకు ఇబ్బంది రాకుండా పట్టాలు అందించనున్నారు.
అనేక గ్రామాల్లో భూ సమస్యలు
వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు అత్యధికంగా ఉంటాయి. రెవెన్యూ రికార్డుల్లో అనేక తప్పులు నమోదు కావడం.. సర్వే నంబర్ల ప్రకారం మ్యాప్‌లు లేకపోవడం.. గ్రామాల్లో కనీసం నక్ష లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని ఆసరాగా చేసుకున్న కొందరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, భూ యజమాని ప్రమేయం లేకుండానే అమ్ముకోవడం వంటివి చోటుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం సర్వే చేపట్టి మ్యాప్‌లకు రూపకల్పన ఇవ్వాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్లకు తప్పకుండా మ్యాప్ ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట నక్ష లేని ఈ 20 గ్రామాల్లో పూర్తయిన అనంతరం పూర్తిస్థాయి గ్రామాల్లో చేపట్టనున్నారు.
మండలం గ్రామాలు
రాయికల్ దావన్‌పల్లి
బీర్‌పూర్ అన్నారం, డొంకేశ్వర్, మోతినగర్ (గంగసముద్రం, నూతపల్లి), మోతినగర్ (సిరిపురం), నేదునూర్, వచ్చునూర్
మల్లాపూర్ ఇందిరానగర్, రత్నాపూర్, నడికుడ, సంగెంశ్రీరాంపూర్
మెట్‌పల్లి మేడిపల్లి, బండలింగాపూర్
ఇబ్రహీంపట్నం బర్తీపూర్, కోజన్‌కొత్తూర్ (కమలనగర్), కేశాపూర్
ధర్మపురి మగ్గిడి, గాదెపల్లి
వెల్గటూర్ జగదేవ్‌పేట
భూవివాదాలకు చెక్
కోమన్‌పల్లిలో విజయవంతం..
జిల్లాలో మరో 20 గ్రామాల ఎంపిక
మ్యాప్‌ల రూపకల్పనకు చర్యలు


