ప్రజాపాలనకు నిదర్శనం
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు
జగిత్యాల: పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్‌లో మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేయడం జరిగిందన్నారు. జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలవడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దోచుకోవడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరిట దోచుకున్నారని ఆరోపించారు. రెండేళ్లలో ఏ సీఎం చేయని పనులు సీఎం రేవంత్‌రెడ్డి చేశారని వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎన్నికల ప్రక్రియలో అనేక ఇబ్బందులు పెట్టేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాఫీగా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగిందని, ఎలాంటి భయాందోళనకు గురిచేయలేదన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమశాఖ మంత్రిగా ఉండి ఒక్క హాస్టల్‌కు పక్కా భవనం నిర్మించలేదన్నారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ధర్మపురిలో బస్‌డిపో, డివిజన్ కేంద్రం ఇలా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. రోళ్లవాగుపై సీఎం దృష్టికి తీసుకెళ్లి అటవీశాఖ అనుమతితో గేట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.60 కోట్ల ప్రాజెక్ట్ పనిని రూ.160 కోట్లకు పెంచేలా మాజీమంత్రి చూశారని ఆరోపించారు.
హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి: నందయ్య
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేపై అనవసరపు ఆరోపణలు చేశారని, హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది విద్యాసాగర్‌రావు కాదా అని ప్రశ్నించారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన కోరుట్లలో చేసిందేమీలేదన్నారు. ఇకనైనా జగిత్యాల ఎమ్మెల్యేపై ఆరోపణలు మానుకోవాలన్నారు.


