‘పంచాయతీ’ కిక్కు
గ్రామాల్లో ఏరులై పారిన మద్యం జిల్లావ్యాప్తంగా నవంబర్‌లో రూ.43.29 కోట్ల అమ్మకాలు డిసెంబర్ 15 రోజుల్లోనే రూ.42.67 కోట్ల విక్రయాలు
జగిత్యాలక్రైం: స్థానిక సంస్థలు అంటేనే పల్లెల్లో హంగామా ఉంటుంది. దీనికి తోడు పోటీచేసిన ప్రతీ అభ్యర్థి ఓటరును ప్రలోభ పెట్టేలా మందుతో పాటు, విందులు, నగదు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో మద్యం లేనిదే గ్రామాల్లో ప్రచారం, సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు జనం రారు. ఈనేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన ప్రతీ అభ్యర్థి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు పంపిణీ చేస్తూ తమ ఓటును వేయించుకునేలా ప్రలోభపెట్టారు.
17 రోజుల్లో రూ.42.67 కోట్ల అమ్మకాలు
జిల్లాలో 385 గ్రామపంచాయతీలు, 3,536 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు భారీగా మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు పంపకాలు చేపట్టారు. దీంతో కేవలం ఈనెలలో 17 రోజుల్లో రూ.42,67,39,850 అమ్మకాలు జరిగాయి. నవంబర్‌తో పాటు, డిసెంబర్‌లో భారీగా మద్యం విక్రయించారు. దీంతో కొత్త దుకాణదారులకు స్థానిక ఎన్నికల సందడితో భారీగా వ్యాపారం జరిగింది.
గతేడాది విక్రయాలు..
గత సంవత్సరం 2024 నవంబర్‌లో లిక్కర్ బాక్స్‌లు 50,073, బీర్ బాక్స్‌లు 1,31,761 విక్రయించారు. మొత్తం రూ.36,31,69,739 విక్రయాలు చేపట్టారు. అలాగే డిసెంబర్‌లో లిక్కర్ బాక్సులు 64,640, బీర్ బాక్స్‌లు 1,34,653 విక్రయించారు. మొత్తం రూ.50,18,41,471 విలువ గల మద్యం విక్రయించారు.
నవంబర్, డిసెంబర్‌లో 17 రోజుల్లోనే..
ప్రస్తుతం నవంబర్‌లో జిల్లాలో 54,712 లిక్కర్ బాక్స్‌లు, 98,759 బీర్ బాక్స్‌లు విక్రయించారు. వీటి ద్వారా రూ.43,29,58,258 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్ 1 నుంచి 17 వరకు 50,700 లిక్కర్ బాక్స్‌లు, 71,202 బీర్‌బాక్స్‌లు విక్రయించగా రూ.42,67,39,850 ఆదాయం సమకూరింది. దీంతో ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.


