కొత్తదనం.. సమస్యల స్వాగతం
పల్లె పోరులో ఎన్నికై నవారు 90శాతం కొత్తవారే గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు పంచాయతీ ఖాతాల్లో ఖజానా ఖాళీ నూతన సర్పంచులపైనే కోటి ఆశలు
జగిత్యాల: పదిహేను రోజుల పాటు రసవత్తరంగా సాగిన గ్రామపోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 385 పంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. చిన్న గ్రామాల్లో రూ.5లక్షల నుంచి 10 లక్షలు, మేజర్ పంచాయతీల్లో రూ.80 లక్షల వరకు ఖర్చు పెట్టి ఎలాగోలా పదవులను దక్కించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోటీ తీవ్రంగా నెలకొంది. అప్పుడు బరిలో ఉన్న అభ్యర్థులు అనుభవపూర్వకంగా చాలా మంది తప్పుకున్నారు. కొందరు ఖర్చులకు భయపడి, మరికొందరు తెచ్చిన అప్పులు తీర్చకపోగా, గత ప్రభుత్వంలో బిల్లులు రాకపోవడంతో చాలా మంది పోటీలో నిలవలేదు. దీంతో చాలా మంది కొత్తవారు బరిలో నిలిచారు. జిల్లాలో 385 సర్పంచ్ స్థానాలకు గాను దాదాపు 90 శాతం కొత్తవారే గెలుచుకున్నారు. కొన్ని చోట్ల గతంలో భర్తలు పోటీ చేసిన స్థానంలో మహిళలకు రిజర్వేషన్ రావడంతో భార్యలను నిలబెట్టి ఐదు శాతం మాత్రం గెలిపించుకున్నారు. పాత స్థానాల్లో నిలబడి గెలిచిన వారు ఐదు శాతం వరకు ఉంటారు.
గ్రామాల్లో మార్పు వచ్చేనా..
జిల్లాలోని పంచాయతీల్లో కొంత కొత్త, పాతవారు ఉన్నా తొలిసారి ఎన్నికై నవారే అత్యధికంగా సర్పంచులు ఉన్నారు. 90 శాతం గెలిచిన కొత్తవారిలో ఎక్కువగా యువత, మహిళలున్నారు. గ్రామ బాగోగులు చూడటంతో పాటు, ప్రతీ సమస్యపై స్పందించాల్సిన బాధ్యత సర్పంచులపై ఉంటుంది. రెండు నెలలకోసారి పాలకవర్గం సమావేశం నిర్వహించుకోవడం, గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. రైతులను సంఘటితం చేస్తూ పంటల సాగుపై అధి కారులతో కలిసి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా గ్రామాల్లో డ్రెయినేజీలు, పారిశుధ్యం ప్రతీ స ర్పంచ్, వార్డు సభ్యులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పల్లెల్లో ఆదాయ వనరులపై దృష్టి పెట్టి పంచాయతీకి ఆదాయం పెంచుకునేలా ఈ నూతన సర్పంచులు బాధ్యతలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వచ్చినప్పటికీ అవి జనాభాను బట్టి విడుదలవుతాయి. పాలకవర్గాల తీర్మానంతోనే పనులు చేపట్టాలి.
సవాళ్లే అధికం
గ్రామ పంచాయతీలను రెండేళ్లుగా నిధుల కొరత వేధిస్తోంది. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పంచాయతీ ఖాతాల్లో నిధులు అందుబాటులో లేవు. రెండుళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. ముఖ్యంగా కోతులు, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పాఠశాలలు శిథిలావస్థలో ఉండడం, టాయిలెట్స్ లేకపోవడం, సరైన బెంచీలు, కరెంట్ లేక చాలాచోట్ల ఇబ్బందులున్నాయి. గత ప్రభుత్వంలో మన ఊరు– మన బడి పథకం కింద మరమ్మతులు చేసినా ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతులు చేపట్టారు. కొత్త సర్పంచులు వాటిపై శ్రద్ధపెట్టి పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది. అలాగే గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తదితర సమస్యలపై చర్యలు తీసుకోవాలి.


