ఆఖరి పోరాటం!
మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం 408 గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు మెజారిటీ స్థానాల్లో హస్తం, రెండోస్థానం కోసం బీఆర్‌ఎస్, మూడోస్థానం కోసం బీజేపీ గట్టిపోటీ తుదిసమరంలో సర్వశక్తులు ఒడ్డుతున్న మూడు పార్టీలు
408 గ్రామాల్లో మెజారిటీ కోసం..
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
గ్రామపంచాయతీ తుది పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మమైన ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆదినుంచీ అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఆదినుంచీ తన పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పటివరకూ రెండువిడతల ఎన్నికల్లో ఇదే దృశ్యం కనిపించింది. కీలకమైన మూడోవిడతలోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇక ఆఖరి పోరాటంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ భావిస్తుండగా.. ఇప్పటి వరకూ 64 సీట్లు గెలిచిన బీజేపీ.. 100 సీట్లకుపైగా గెలుపొంది సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డేందుకు ఆఖరి ఎన్నికల బరిలోకి దిగాయి.
ఆగని డబ్బు, మద్యం పంపిణీ..
తొలి రెండువిడతల్లో మద్యం, డబ్బు పంపిణీతో అభ్యర్థులు చేతులు కాల్చుకున్నా.. మూడోవిడతలోనూ అవే దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. సర్పంచ్ బరిలో ఉన్నవారు ఎక్కడా తగ్గడం లేదు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఓటర్లకు తాయిలాలిచ్చి ప్రలోభాలకు గురిచేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లిలో అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకే పరిమితమవగా.. జగిత్యాల జిల్లాలో ఒకడుగు ముందుకేసి ఓటర్లకు ఏకంగా వెండి నాణేలు పంచుతుండడం విశేషం. ఇంత పంపిణీ జరుగుతున్నా.. అభ్యర్థులు ఓటర్లను పెట్టే ప్రలోభాలను పోలీసులు పూర్తిస్థాయిలో నియంత్రించడం లేదన్న విమర్శలు ఆగడం లేదు.
ఇప్పటి వరకూ తొలివిడత 398 గ్రామాలు, రెండోవిడతలో 418 పంచాయీల్లో ఎన్నికలు జరిగాయి. రెండువిడతల్లో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 436 స్థానాలు గెలుచుకోగా, బీఆర్‌ఎస్ మద్దతిచ్చిన చోట 224 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇక బీజేపీ సపోర్ట్‌తో 64 మంది సర్పంచులుగా గెలిచారు. ఇతరులు 87 మంది స్వతంత్ర సర్పంచులుగా ఎన్నికయ్యారు. కీలకమైన మూడోవిడతలో 436 స్థానాల్లో కనీసం 300 వరకు స్థానాలను వశపరచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక సగానికిపై సీట్లు గెలవాలని బీఆర్‌ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. రెండువిడత ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రులు, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి వచ్చిన వారిని, మూడోవిడతలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో కలిపి 800 వరకు సర్పంచుల సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాలోని 408 గ్రామాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ఏర్పాట్లు పూర్తిచేశారు.


