సర్పంచులకు అండగా ఉంటాం
జగిత్యాలటౌన్: కొత్తగా ఎన్నికై న సర్పంచులకు అండగా ఉంటూ.. అభివృద్ధికి నిధులు ఇస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి మద్దతుతో జగిత్యాల నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులు, వార్డుసభ్యులకు మంగళవారం జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్‌లో అభినందన సభ నిర్వహించారు. సర్పంచులు మంత్రి అడ్లూరి, జీవన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్యను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరగనివ్వబోమని తెలిపారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటారని అన్నారు. జగిత్యాలలో ఒరిజనల్ కాంగ్రెస్ నాయకులు గెలువకూడదని మధ్యలో వచ్చిన నాయకులు అడ్డుకున్నారని, వ్యక్తిగత స్వార్థం, తన పొట్ట నింపుకొనేందుకు పార్టీలోకి వచ్చి తనను కలిస్తేనే నిధులు అంటూ సర్పంచులను బెదిరిస్తున్నాడని, అభివృద్ధి అతని దగ్గర కాదని, ప్రభుత్వం వద్ద ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, బీర్‌పూర్ మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తన వల్ల చెడ్డపేరు వస్తే రాజీనామా
క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా.. జీవన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా 40ఏళ్లుగా పనిచేస్తున్నానని, తన వల్ల పార్టీకిగానీ.. జీవన్‌రెడ్డికిగానీ చెడ్డపేరు వస్తే అరగంటలో తన పదవికి రాజీనామా చేస్తానని డీసీసీ అధ్యక్షుడు నందయ్య అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌తో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయనపై వచ్చిన ఆరోపణలపై పై విధంగా స్పందించారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదినని, జీవన్‌రెడ్డికి నమ్మిన బంటునని, అలాంటి తనకు పదవి ఉన్నా.. లేకపోయినా ఒకటేనని స్పష్టం చేశారు. రాజీనామా పత్రం జేబులోనే ఉందని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఇదే వేదికపైనే రాజీనామా చేసి వెళ్లిపోతానని తేల్చి చెప్పారు.


