ముహూర్తాలు.. ముడుపులు.. ఉపవాసాలు | - | Sakshi
Sakshi News home page

ముహూర్తాలు.. ముడుపులు.. ఉపవాసాలు

Nov 28 2025 8:59 AM | Updated on Nov 28 2025 8:59 AM

ముహూర్తాలు.. ముడుపులు.. ఉపవాసాలు

ముహూర్తాలు.. ముడుపులు.. ఉపవాసాలు

● ఈ విషయాలు తెలియాల్సిందే ● పరిమితికి మించే ఎన్నికల ఖర్చు

జగిత్యాలజోన్‌: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావహులు వేద పండితులు, జ్యోతిష్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. సర్పంచ్‌గా పోటీ చేస్తే గెలుస్తానా..? లేదా..? అని ఆరా తీస్తున్నారు. పండితులు మాత్రం తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ జాతకం బాగుంది.. తప్పకుండా గెలుస్తావ్‌.. అంటూ భరోసా ఇస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓటు అడిగితే విజయం వరిస్తుందని కూడా సూచనలు చేస్తున్నారు. పోటీ చేయాలనుకుంటున్నవారు నమ్ముకున్న దేవుళ్ల వద్దకు కుటుంబసమేతంగా వెళ్లి పూజలు చేసి, ముడుపులు కడుతున్నారు. నామినేషన్‌ ఏ రోజు వేయాలి..? ఏ ముహూర్తానా వేస్తే కలిసి వస్తుంది..? అని అడిగి తెలుసుకుంటున్నారు. గెలిస్తే దేవుడి పేరిట వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటామని ముడుపులు కడుతున్నారు. జనరల్‌ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని సమాలోచనలు చేస్తున్నారు.

సర్పంచ్‌ అభ్యర్థులకు పోలీసుల సూచనలు

జగిత్యాలక్రైం: అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే వినియోగించాలి.

● ఊరేగింపు కార్యక్రమాలు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలి.

● కులం, మతం, ప్రాంతం, వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడరాదు.

● వాహనాలకు లౌడ్‌ స్పీకర్లు వినియోగించాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాలి.

● వాహనాలపై రిటర్నింగ్‌ అధికారి జారీ చేసిన పర్మిట్‌ ఒరిజినల్‌ కాపీతోపాటు వాహనం నంబర్‌, అభ్యర్థి పేరు ప్రదర్శించాలి.

● నామినేషన్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

● నామినేషన్‌ సమర్పించడానికి ఊరేగింపుతో వచ్చే అభ్యర్థి తన అనుచరులు, మద్దతుదారులు మొదలైన వారు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అనుమతిస్తారు.

● రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి, మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది.

రాయికల్‌: ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, ఐదు వేల కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు ఐదువేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామాల్లో రూ.50 వేలు, ఐదు వేల కంటే తక్కువ ఉంటే రూ.30 వేల వరకు ఖర్చు చేసుకోవచ్చు.

● పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు పిల్లలు.. ఆపై ఉన్నవారు పోటీలు ఉండే నిబంధన 1994 వరకు కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన వచ్చింది. 30 ఏళ్ల తర్వాత.. ఈ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ నవంబర్‌ 1న గెజిట్‌ విడుదల చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో ముగ్గురు, అంతకన్నా ఎక్కువ సంతానం గల వారు కూడా పోటీ చేయవచ్చు.

● ఒక అభ్యర్థి తన స్థానానికి నాలుగు నామినేషన్‌ పత్రాల వరకు దాఖలు చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు పోటీ చేస్తే నిర్దేశిత గడువులోపు ఒకటి మినహా మిగతా నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. లేదంటే అన్నీ తిరస్కరణకు గురవుతాయి. ముఖ్యంగా గ్రామపంచాయతీలో ఆస్తి, ఇతరత్రా బకాయిలు ఉండకూడదు. ప్రభుత్వ, పంచాయతీ ఉద్యోగులు, రుణ ఎగవేతదారులు అనర్హులు.

కొత్త బ్యాంక్‌ ఖాతా.. అభ్యర్థుల ఇక్కట్లు

కథలాపూర్‌: సర్పంచ్‌, వార్డు స్థానాలకు నామినేషన్‌ దాఖలు చేయాలంటే కొత్తగా బ్యాంక్‌ ఖాతా తెరవాల్సిందేనని అధికారులు చెప్పడంతో ఆశావహులు ఇక్కట్ల పాలయ్యారు. గతంలో నామినేషన్‌ పత్రాలకు గ్రామపంచాయతీ పన్నుల నో డ్యూ సర్టిఫికెట్‌, కులం సర్టిఫికెట్‌ జతపరిచేవారు. ఈసారి కొత్తగా బ్యాంక్‌ ఖాతా తెరవాలని, వాటి జిరాక్స్‌ను జతపరచాలని రిటర్నింగ్‌ అధికారులు పేర్కొనడంతో ఆశావహులు బ్యాంకుల వద్దకు పరుగెత్తుతున్నారు. ఆయా బ్యాంకుల్లో గతంలో ఖాతా ఉన్నప్పటికీ కొత్తగా ఖాతా తెరవాల్సిందేనని చెప్పడంతో నాయకులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో బ్యాంక్‌ ఖాతా ఉంటే అదే బ్యాంకులో మరో ఖాతా ఇవ్వడం కష్టమని బ్యాంకర్లు చెబుతుండడతో మండల పరిషత్‌ కార్యాలయానికి పరుగెత్తుతున్నారు. కథలాపూర్‌లో ఇలాంటి పరిస్థితి రావడంతో ఎంపీడీవో శంకర్‌ బ్యాంక్‌ అధికారులకు లేఖ రాశారు. దీంతో బ్యాంకు అధికారులు కొత్త ఖాతాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు.

ఓట్ల కోసం వంగివంగి దండాలు

రాయికల్‌: గ్రామాల్లో మొన్నటి వరకు ఏమిరా బిడ్డా బాగున్నావా.. ఎలా ఉన్నావురా అంటూ అరెయ్‌ తొరెయ్‌ మీది నుంచి దిగని నాయకులు సర్పంచ్‌ ఎన్నికల్లో రిజర్వేషన్‌ అనుకూలంగా రావడంతో మాటమార్చుతున్నారు. వంగివంగి దండాలు పెడుతున్నారు. ఉదయం నుంచే గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్దకు చేరుకుంటున్నారు. హోటళ్ల వద్ద ప్రత్యక్షమవుతూ ‘అన్నా బాగున్నావా.. చలిబాగా వేస్తుందే.. అటుకులు బుక్కదాం, చాయ్‌ తాగుదాం దా..’ అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఎదరుపడిన ప్రతిఒక్కరినీ అమ్మా బాగున్నారా, భోజనం చేశారా అంటూ పలుకరిస్తున్నారు. సాయంత్రం కాగానే చిన్నారులతో ఆటవిడుపులు, రాత్రి కాగానే యువత, వృద్ధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉంటున్నాను.. మీ ఓటు నాకే వేయండి..’ అంటూ అభ్యర్థిస్తున్నారు. మొన్నటి వరకు అరెయ్‌ తొరెయ్‌ అన్న వ్యక్తి నేడు ఒక్కసారిగా వంగి వంగి దండాలు పెట్టడం ఏంటని ఓటర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎన్నికలు అయ్యేలోపు ఇంకా ఎన్ని చిత్రాలో చూడాల్సి వస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

35 ఏళ్ల తర్వాత జనరల్‌ మహిళ..

కోరుట్లరూరల్‌: కోరుట్ల మండలంలోని సంగెం పంచాయతీ 35 ఏళ్ల తర్వాత జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. 1990లో సంగెం సర్పంచ్‌ స్థానం జనరల్‌కు కేటాయించగా.. ఓసీ సామాజిక వర్గానికి చెందిన తీగల రాములు సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. అనంతరం ఏడేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీసీ జనరల్‌ రిజర్వ్‌ అయ్యింది. తర్వాత ఎస్సీ మహిళకు కేటాయించారు. తర్వాత బీసీ జనరల్‌.. అనంతరం బీసీ మహిళ, 2019 ఎన్నికల్లో ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది. 30ఏళ్లుగా జనరల్‌ ఆశావహులకు నిరాశనే మిగిలింది. తాజాగా ఈసారి జనరల్‌ మహిళకు రిజర్వు కావటంతో ఉత్కంఠ పోటీ జరిగే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

మరోసారి అదృష్టం వరించాలని..

జగిత్యాలజోన్‌: ఇప్పటికే సర్పంచ్‌లుగా పనిచేసిన పలువురు తిరిగి ఈసారి ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే ధీమాతో రంగంలోకి దిగుతున్నారు. రెండుమూడు సార్లు రిజర్వేషన్‌ అనుకూలించక పోటీకి దూరంగా ఉన్నవారు ప్రస్తుతం జనరల్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీగా పోటీ పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోతే ఐదేళ్లు ఆగాల్సి వస్తుందనే ఆలోచనతో పోటీకి సై అంటున్నారు. మాజీ సర్పంచ్‌లు తాను పోటీ చేస్తే బాగుంటుందా..? లేదా భార్య పోటీ చేస్తే బాగుంటుందా..? అనే విషయాలపై అనుయాయులతో మల్లాగుల్లాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ‘గడిచిన ఎన్నికల్లో నీకు సపోర్ట్‌ చేసి సర్పంచ్‌ను చేసినం.. ఎప్పుడూ నువ్వేనా..? ఈ సారీ నాకు అవకాశం ఇవ్వు..’ అంటూ తమ దగ్గరి అనుచరులే అడుగుతుండటంతో మాజీ సర్పంచ్‌లు కంగుతింటున్నారు.

సర్పంచ్‌ బరిలో ఉంటున్నారా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement