జగిత్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శరణుఘోషతో మారుమోగింది. అనంతరం భక్తులకు మహాభిక్ష చేశారు. గురుస్వాములు నీలం దశరథరెడ్డి, మానాల కిషన్, అడువాల లక్ష్మణ్, రాచకొండ నాగరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ అడువాల జ్యోతి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
టీబీ నివారణకు కృషి చేయాలి
మల్యాల: టీబీ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించాలని, వ్యాధి నిర్ధారణ, నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం టీబీ అలర్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టీబీ చాంపియన్లకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన చర్యలు, లక్షణాలపై అవగాహన కల్పించాలన్నారు. టీబీని ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. మండల వైద్యురాలు మౌనిక, రవి,దత్తురామ్, శ్రీనివాస్, రమేశ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో వైద్యురాలికి సీమంతం
మెట్‌పల్లి: పట్టణంలోని సాయిరాంకాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో స్థానిక అర్బన్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వాణిరెడ్డికి గురువారం సీమంతం చేశారు. అంగన్‌వాడీ, వైద్య సిబ్బంది ఆమెకు సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాణిరెడ్డి అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్ ప్రతిభ, టీచర్ అమృత, సిబ్బంది సులోచన, సంకీర్తన, సుజాత తదితరులున్నారు.
నేటి నుంచి జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు
జగిత్యాల: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక, ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శనలను జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో ఈనెల 28, 29న నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. ఈ మేరకు గురువారం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంతోపాటు వారిలోని సృజనాత్మకతను వెలికితీయడం కోసం వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మానక్ పోటీలను నిర్వహిస్తోందన్నారు. 2024–25కు సంబంధించి జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్‌స్పైర్ అవార్డు మానక్), 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో పాల్గొనాలన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సైన్స్ ఎగ్జిబిట్స్ బోధనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు.
మారుమోగిన అయ్యప్ప శరణు ఘోష
మారుమోగిన అయ్యప్ప శరణు ఘోష
మారుమోగిన అయ్యప్ప శరణు ఘోష


