నూకశాతం పెరిగిందని..
జగిత్యాలరూరల్: జిల్లాలో మూడురోజులు ధాన్యం కాంటా నిలిచిపోయింది. ధాన్యంలో నూకశాతం ఎక్కువగా వస్తోందంటూ దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యం వరిపంటపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరాకు సుమారు 25 నుంచి 28 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా.. ఇప్పుడు 18 నుంచి 20 క్వింటాళ్లకు మించడం లేదు. పండిన ఆ ధాన్యంలో కూడా వాతావరణ పరిస్థితులతో నూకశాతం ఎక్కువగా వస్తోంది.
1.67లక్షల టన్నులే కొనుగోలు
జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఆరు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కానీ సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల టన్నులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. భారీవర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి భారీగా తగ్గింది. పండించిన ధాన్యాన్ని హార్వెస్టర్లతో కోయించి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కేంద్రాల్లో ఇప్పటివరకు 1.67లక్షల టన్నులు కొన్నారు. ఇంకా 2.30 లక్షల టన్నుల సేకరించాల్సి ఉంది.
నూకశాతంతో మిల్లర్ల కష్టాలు
రైస్‌మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యం చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యంలో నూకశాతం ఎక్కువగా వస్తుండటంతో మిల్లర్లు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలోని 89 పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు, 10 రా రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించారు. వీరు ప్రస్తుతం క్వింటాలుకు రారైస్ 67 కిలోలు, పారాబాయిల్డ్ 68 కిలోలు ప్రభుత్వానికి అప్పగించేవారు. ఈ ఏడాది నూక శాతం 15 నుంచి 20 శాతం ఉండగా.. 40 శాతం బియ్యం వస్తోంది.
మిల్లర్లతో సమావేశం
ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ మిల్లర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవాల్సిందేనని నచ్చజెప్పారు. ప్రతి మిల్లర్ ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. దీనికి మిల్లర్లు అంగీకరించడంతో గురువారం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.


