చేజేతులా.. పోగొట్టుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

చేజేతులా.. పోగొట్టుకుంటున్నారు

Oct 29 2025 7:55 AM | Updated on Oct 29 2025 7:55 AM

చేజేతులా.. పోగొట్టుకుంటున్నారు

చేజేతులా.. పోగొట్టుకుంటున్నారు

● జిల్లాలో 2022లో 635 సైబర్‌ నేరాలు జరిగాయి. ఇందులో బాధితులు రూ.1,92,65,117 కోల్పోయారు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయడంతో వారు సైబర్‌ నేరగాళ్ల ఖాతాలను స్తంభింపజేసి 158 కేసుల్లో రూ.17,17,299 రికవరీ చేశారు. ● 2023లో 866 కేసుల్లో రూ.8,61,05,027 బాధితులు కోల్పోగా పోలీసులు 123 కేసుల్లో రూ.5,07,31,989 రికవరీ చేశారు. ● 2024లో 1288 కేసులు నమోదయ్యాయి. ఇందులో రూ.1,27,07,500 బాధితులు కోల్పోగా పోలీసులు రూ.1,12,40,544 రికవరీ చేయగలిగారు. ● ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 658 కేసులు నమోదుకాగా.. ఇందులో 15 మందిని అరెస్ట్‌ చేశారు. ఇందులో బాధితులు రూ.3,28,580 కోల్పోగా.. పోలీసులు రూ.89,96,812 రికవరీ చేశారు.

అవకాశంగా మల్చుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నా.. ఆగని సంఘటనలు జనవరి నుంచి ఇప్పటివరకు 658 కేసులు నమోదు నేరగాళ్లు దోచిన సొమ్ము రూ.3.28 కోట్లు

జగిత్యాలక్రైం: సాంకేతిక రంగంలో మార్పులు వస్తున్నా.. ప్రజలు, వ్యాపారులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నా.. సైబర్‌ నేరగాళ్లు మాత్రం ఎత్తుకుపైఎత్తు వేస్తూ వారిని బురిడీకొట్టిస్తూ అందినకాడికి దోపిడీ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సైబర్‌ నేరాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించినా.. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా నేరగాళ్లు తమపని తాము చేసుకుంటూ వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

జనవరి నుంచి ఇప్పటి వరకు 658 సైబర్‌ నేరాలు

టోల్‌ఫ్రీ నంబర్లు 1930, డయల్‌ 100

బాధితులు సైబర్‌ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌తోపాటు 100కు డయల్‌ చేస్తే తక్షణమే పోలీసులు సైబర్‌ నేరస్తుల ఖాతాలను గుర్తించి రిజర్వ్‌ బ్యాంక్‌ సహాయంతో వారి ఖాతాలను స్తంభింపజేస్తారు. నేరగాళ్ల ఖాతాలో జమ అయిన డబ్బును రికవరీ చేసి బాధితులకు అందించే అవకాశం ఉంటుంది. సైబర్‌ నేరస్తులు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతోపాటు ఓటీపీ నంబర్లతోనే ఫ్రాడింగ్‌ చేస్తున్నారు. బ్యాంక్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, లక్కీ లాటరీ గెలుచుకున్నారని, సెల్‌ఫోన్‌ నంబరుకు ఓటీపీ వచ్చిందని, ఆ నంబర్‌ చెప్పాలని తప్పుదారి పట్టింది ఖాతాల్లోని డబ్బును వారి ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ ఫొటోను మార్చి స్నేహితులు, కస్టమర్ల నుంచి అత్యవసరంగా డబ్బు అవసరముందని రిక్వెస్ట్‌లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్‌, లింక్‌లు, పీఎం కిసాన్‌, కుటుంబ సమగ్ర సర్వే, తెలంగాణ రవాణా శాఖ న్యూ చాలన్స్‌ పేరుతో లింక్‌లు పంపిస్తున్నారు. కొంతమంది వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ లేదా రుణాలు అందజేస్తామని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని మోసం చేస్తున్నారు.

యాప్‌లతోనూ మోసం

ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరిలో సెల్‌ఫోన్‌ వాడకం పెరిగిపోయింది. బ్యాంక్‌ ఖాతాలు, వ్యక్తిగత సమాచారం సెల్‌ఫోన్‌లోనే భద్రపర్చుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌ మోసగాళ్లు చాలామంది సెల్‌ఫోన్లకు యాప్‌లు పంపించి డౌన్‌లోడ్‌ చేసుకుంటే క్యాష్‌బ్యాక్‌ వస్తుందని నమ్మిస్తున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌ కాగానే వారి వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్తున్నాయి. వెంటనే వారు మోసాలకు పాల్పడుతున్నారు.

నేరాలపై విస్తృత అవగాహన

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో, పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు. మోసపోయిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1930తోపాటు డయల్‌ 100కు ఫిర్యాదు చేస్తే సత్వరమే డబ్బును రికవరీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement