ఓ వైపు తెగుళ్లు..
మరోవైపు వర్షాలు
వెల్గటూర్: ఈ వానాకాలం సీజన్ రైతులకు కడగండ్లను మిగిల్చింది. యూరియా కొరత తీవ్రంగా వేధించినా ఎలాగోలా కష్టపడి పంట పండిద్దామనుకున్న రైతుల ఆశలపై అకాల వర్షాలు నీళ్లు చల్లినట్లయ్యింది. అంతుచిక్కని తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అన్ని కష్టాలను తట్టుకుని తీరా పంటపండిస్తే.. కోతలు మొదలయ్యే సమయంలో మరోసారి వర్షాలు రైతన్న పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండడంతో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు.
వరికి తప్పని తెగుళ్లు బెడద
వానాకాలంలో జిల్లాలో 3.15లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 8.15లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా కూడా వేశారు. అయితే అకాలవర్షాలు, వాతావరణ మార్పులతో వరిని సుడిదోమ, ఎండాకు, పాముపొడ, కంకినల్లి వంటి తెగుళ్లు ఆశించాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసలే యూరియా కొరతతో తీవ్ర ఇబ్బంది పడిన అన్నదాత.. అష్టకష్టాలు పడి పంట పండిస్తే తెగుళ్లు సోకి పెట్టుబడి రెండింతలయ్యింది. తీరా కోతలు మొదలయ్యే సమయంలో మరోసారి అకాల వర్షాలు కురుస్తుండడం.. రెండుమూడు రోజుల పాటు కోతలు వద్దని అధికారులు హెచ్చరిస్తుండడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
‘ఫసల్ బీమా’ మార్చితేనే
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గ్రామం, మండలం యూనిట్‌గా మాత్రమే నష్టపోయిన పంటలకు పరిహారం అందించే అవకాశం ఉంటుంది. ఈ కారణంతోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. దీంతో అకాల వర్షాలు, చీడపీడలు, తెగుళ్లు ఆశించి పంట నష్టం జరిగినప్పుడు రైతులకు బీమా అందడం లేదు. ఫసల్ బీమా పథకంలో మార్పులు చేసి బీమా చేసిన వ్యక్తి యూనిట్‌గా పరిహారం అందించినప్పుడే లాభం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికై తే నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎలాంటి బీమా లేకపోవడంతో ఆగమవుతున్నారు.
జాగ్రత్తలు
అవసరం
వానాకాలం పంటల్లో హఠాత్తుగా వచ్చే తెగుళ్లను తట్టుకోవాలంటే మొదటి రోజునుండే సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఫసల్ బీమా పథకంలో గ్రామం యూనిట్‌గా పరిహారం అందుతుంది. వ్యక్తిగతంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందదు. – భాస్కర్, డీఏవో
ఓ వైపు తెగుళ్లు..
ఓ వైపు తెగుళ్లు..
ఓ వైపు తెగుళ్లు..


