హార్వెస్టర్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలి
జగిత్యాల: హార్వెస్టర్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలని, యంత్రాల అద్దె రేట్లు పారదర్శకంగా ఉండాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. గురువారం సమావేశ మందిరంలో హార్వెస్టర్ల యజమానులు, డ్రైవర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరికోత సమయంలో నాణ్యమైన ధాన్యం సేకరణకు జాగ్రత్తలు తీసుకోవాలని, హార్వెస్టర్ యంత్రాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ, హార్వెస్టర్ యజమానులు పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోత ప్రారంభించాలని, మిషన్లలో బ్లోయర్ సక్రమంగా ఆన్‌లో ఉంచాలని, ఆర్పీఎం 19–20 తక్కువగా ఉండకూడదన్నారు. ధాన్యం నాణ్యత దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తేమశాతం 17లోపు ఉంచితే మద్దతు లభిస్తుందన్నారు. డీటీవో శ్రీనివాస్ మాట్లాడుతూ, హార్వెస్టర్ యంత్రాల రవాణా సమయంలో రోడ్డు రవాణా నిబంధనలు తప్పక పాటించాలని, వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.


