
సాగుకు అనుబంధంగా పౌల్ట్రీ
10 వేల కోళ్లతో ఫాం
రోజూ ఫామ్‌కెళ్తా
జగిత్యాలఅగ్రికల్చర్: ఇటీవల కాలంలో రైతు కుటుంబాలకు చెందిన యువత సాగుకు అనుబంధంగా లేయర్ కోళ్ల ఫాం (గుడ్ల కోళ్లు)లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్నవారు తమ వ్యవసాయ భూమిలో అధునాతన టెక్నాలజీతో లేయర్ ఫాంలు ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం ద్వారా అనుకున్న స్థాయిలో ఆదాయం రాక కోళ్లఫాంలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
● 10వేల కోళ్లతో ప్రారంభిస్తూ..
ఒకప్పుడు కోళ్ల లేయర్ ఫాంలు అంటే బడా పారిశ్రామికవేత్తలే గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు తామేమి తక్కువ కాదంటూ యువత ఈ రంగంలోకి వస్తున్నారు. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లినవారు, హైదరాబాద్ వంటి నగరాల్లో చాలీచాలనీ జీతంతో పనిచేసేవారు, స్వగ్రామాలకు వచ్చి ఫాంలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దమొత్తంలో పెట్టుబడి కావడంతో ముందుగా ఆయా ప్రాంతాల్లో సక్సెస్ అయిన కోళ్ల ఫాంలను సందర్శించి, వారితో పలు విషయాలు తెలుసుకుంటూ అవగాహనకు వస్తున్నారు. తర్వాత మొదటి దఫాగా 10 వేల కోళ్లతో ప్రారంభిస్తున్నారు. అనుభవం పెరిగిన కొద్ది కోళ్ల సంఖ్యను పెంచుతున్నారు. కోళ్లఫాంలు ఏర్పాటు చేసేందుకు కనీసం రెండుమూడు ఎకరాలు ఉండేలా చూసుకుంటున్నారు.
● బ్యాంకుల చేయూత
వ్యవసాయ భూమి ఉండి కోళ్లఫాంలు నిర్మించుకుంటామని ముందుకు వచ్చే యువకులకు బ్యాంకులు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. 10వేల కోళ్ల ఫాం నిర్మాణానికి రూ.కోటి వరకు ఖర్చు అవుతుండడంతో, ఆ మేరకు బ్యాంకులు రుణం అందిస్తున్నాయి. ఫాంలు నిర్మించిన తర్వాత ఏదైనా సమస్యతో కోళ్లను వేయకుంటే, అద్దెకు ఇచ్చినా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి కోడి గుడ్డుకు వస్తే దాదాపు ఏడాది పాటు గుడ్లు పెడుతుంటుంది. లేయర్ ఫాంలలో కేజీ కల్చర్ రావడంతో, కోళ్లు పోడుచుకోకుండా ఒక్కో బాక్స్‌కు 2 నుంచి 4 కోళ్లను పెడుతున్నారు. పెద్దగా కూలీల అవసరం లేకుండా అధునాత టెక్నాలతో దాణాను బాక్స్‌ల్లో ఉన్న కోళ్ల వద్దకు తీసుకెళ్లవచ్చు. మొక్కజొన్న వంటి ముడిపదార్థాలను కొని, ఫాంలోని ఓ గదిలో గ్రైండింగ్ చేసి, నేరుగా కోళ్లకు అందించే వెసులుబాటు ఉండడంతో యువత ముందుకు వస్తున్నారు.
● గుడ్ల అమ్మకందారులతో ఒప్పందం
కోళ్లఫాం యజమానులు గుడ్ల అమ్మకందారులతో నేరుగా ఒప్పందం చేసుకుంటున్నారు. పేపర్ రేటు లేదా 25పైసలు తక్కువతో ఏడాదంతా రోజు మార్చి రోజు గుడ్లు తీసుకెళ్తారు. దీంతో గుడ్లు అమ్ముడు పోవనే భయం ఉండదు. కోళ్లకు ప్రొటిన్లు, విటమిన్లు ఇచ్చే దాణాను కంపెనీలు సరఫరా చేస్తుండడంతో పెద్దగా ఇబ్బందులు లేవు. కోళ్లు విసర్జించిన పేడకు మంచి డిమాండ్ ఉంది. కొంత తమ పొలాలకు ఉపయోగించుకుని, మిగతాది రైతులకు అమ్ముతుంటారు. కోళ్లు గుడ్లు పెట్టడం ఆగిపోయిన తర్వాత ఫాంలను రసాయన మందులతో పిచికారీ చేస్తుండడంతో ఎలాంటి వ్యాధులు దరి చేరే అవకాశం లేదు. అలాగే పదివేల కోళ్ల ఫాంకు కేవలం రెండు లేదా మూడు కూలీల జంటలు చాలు. ఒక్కో జంటకు వారి పనితనాన్ని బట్టి రూ.12 వేల వరకు జీతం ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఫామ్‌కు వెవెళ్లాల్సి ఉంటుంది. ఫాంలలో అశుభ్రత లేకుండా చూసుకోవడం తదితర పనులు చేస్తుంటారు.
ఆసక్తి చూపుతున్న గ్రామీణ యువత
మొన్నటి వరకు వ్యవసాయం చేసిన. పెద్దగా ఆదాయం లేదు. బ్యాంకు లోన్ తీసుకుని 10 వేల కోళ్ల ఫాంను మామిడి తోటలో ఏర్పాటు చేశా. ఎంత పని ఉన్నా ఉదయం, సాయంత్రం ఫాంను సందర్శిస్తా. కోళ్ల ఫాంతో భారీ ఖర్చుతో పాటు ఆదాయం ఉంటుంది.
– రాజేందర్, కట్లకుంట, మేడిపల్లి
వ్యవసాయానికి అనుబంధంగా లేయర్ కోళ్లఫాం ఏర్పాటు చేశా. అంతకంటే ముందు కోళ్ల ఫాం గురించి తెలుసుకున్నా. రోజూ ఫామ్‌ను సందర్శించి, కొత్తగా ఏమి చేయాలో ఆలోచిస్తా.
– మహేందర్, రాయికల్

సాగుకు అనుబంధంగా పౌల్ట్రీ

సాగుకు అనుబంధంగా పౌల్ట్రీ