
వైద్య విద్యార్థులకు తప్పిన రవాణా కష్టాలు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల రవాణా కష్టాలు తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ముందుకొచ్చారు. గతంలో ‘వైద్య కళాశాల ఒకచోట.. వసతి గృహాలు మరో చోట’ శీర్షికన విద్యార్థుల రవాణా కష్టాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. విద్యార్థుల వసతి గృహాలు తీగలగుట్టపల్లి, సీతారాంపూర్, దుర్గమ్మగడ్డలో ఉండడంతో కళాశాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో విద్యార్థులు ఇటీవల కేంద్ర మంత్రికి తమ ఇబ్బందులపై మొరపెట్టుకోగా, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులు, దాతల నుంచి సేకరించిన నిధులతో కొనుగోలు చేసిన బస్సును సోమవారం ఎంపీ కార్యాలయం వద్ద విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో ప్రిన్సిపాల్‌కు అందజేశారు. అలాగే వసతి గృహాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ చెప్పగా.. ఆ బాధ్యతను ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీసుకున్నారు. కాగా, కళాశాల నిర్వహణను నెలరోజుల్లో మరో మంచి భవనంలోకి మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమయ్యే వ్యయాన్ని భరిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈసందర్భంగా మంత్రికి విద్యార్థులు, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు.
హామీ మేరకు బస్సు సౌకర్యం కల్పించిన కేంద్ర మంత్రి బండి