
కొడుకు పట్టించుకోవడం లేదని వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల అర్బన్: కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఓ వృద్ధుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన వివరాలు. అజ్మీర విఠల్, వీరవ్వ దంపతులు ముప్పై ఏళ్ల క్రితం వీర్నపల్లి మండలం నుంచి రుద్రంగికి వలస వచ్చారు. ఇక్కడే 2.35 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, ఇల్లు కట్టుకున్నారు. వీరికి ఒక కుమారుడు అజ్మీర నరేశ్, కూతురు ఉన్నారు. కొడుకు నరేశ్‌కు 10 నెలల క్రితం పెళ్లి చేశారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా ప్రస్తుతం కొడుకు, కోడలు వారిని పట్టించుకోవడం లేదు. ఇంట్లో నుంచి గెంటివేశారు. ఈ విషయమై పెద్ద మనుషులు, పోలీసుల సమక్షంలో పంచాయితీ పెట్టినా.. తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈనెల ఒకటో తేదీన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురైన విఠల్ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్, జిల్లా అధికారులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం కలెక్టర్ వాహనంలోనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విఠల్ పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు.
సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఘటన
ఆస్పత్రికి తరలించిన అధికారులు

కొడుకు పట్టించుకోవడం లేదని వృద్ధుడి ఆత్మహత్యాయత్నం