పాఠశాలలకు రేటింగ్స్‌ | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలకు రేటింగ్స్‌

Sep 11 2025 2:34 AM | Updated on Sep 11 2025 2:34 AM

పాఠశా

పాఠశాలలకు రేటింగ్స్‌

30లోపు దరఖాస్తు చేసుకోవాలి

స్వచ్ఛ ఏవం హరిత్‌ కింద స్కూళ్ల ఎంపిక అధిక మార్కులు పొందితే రూ.లక్ష ప్రోత్సాహం ఈనెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

జగిత్యాల: పాఠశాలల్లో పరిశుభ్రమైన పరిసరాలు.. ఆహ్లాదం.. ఆరోగ్యకరమైన వాతావరణం.. మౌలిక వసతులు కలిగి ఉన్న వాటికి ప్రోత్సాహకాలు అందించే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటా స్వచ్ఛ పాఠశాలలకు నగదు పురస్కారాలు అందజేస్తున్న ప్రభుత్వం ఈసారి స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయ రేటింగ్‌ కింద రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష పురస్కారం అందించేందుకు నిర్ణయించింది. 2025–26 ఏడాదికిగాను పురస్కారాలు అందజేసేలా పాఠశాలలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్‌హెచ్‌వీఆర్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 30లోపు దరఖాస్తులన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే డీఈవో ఆధ్వర్యంలో ఎంఈవో, ఆర్పీలకు శిక్షణ కల్పించారు. పాఠశాలల ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాల ప్రకారం పాయింట్ల కేటాయింపు ఉంటుంది. అత్యధిక పాయింట్స్‌ సాధించిన పాఠశాలలను ప్రత్యేక బృందం తనిఖీ చేసి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తుంది. అనంతరం రాష్ట్రస్థాయి బృందం జాతీయస్థాయికి పంపిస్తుంది. అక్కడ ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహం అందుతుంది.

యాప్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ఎస్‌హెచ్‌వీఆర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ అయ్యాక పాఠశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం పాఠశాల యూడైస్‌ కోడ్‌ను నమోదు చేస్తే మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని సబ్మిట్‌ చేసిన వెంటనే పాఠశాలకు సంబంధించిన వివరాలన్నీ వస్తాయి.

జాతీయస్థాయిలో నెగ్గితే రూ.లక్ష ప్రోత్సాహం

పాఠశాలలు అత్యధిక పాయింట్స్‌ వచ్చి జాతీయస్థాయిలో గుర్తిస్తే ఆ పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి ప్రభుత్వం అందిస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన అనంతరం జాతీయస్థాయికి పంపుతారు. వారు పరిశీలించి ప్రోత్సాహం అందిస్తారు.

ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

ఎస్‌హెచ్‌వీఆర్‌ యాప్‌పై ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్‌ పర్సన్లకు శిక్షణ కల్పించారు. పాయింట్స్‌ ఎలా ఇవ్వాలి..? నమోదు ఎలా చేయాలి అన్నదానిపై జిల్లా కార్యాలయంలో మూడు రోజులు శిక్షణ ఇచ్చారు.

ఎస్‌హెచ్‌వీఆర్‌లో ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. జాతీయస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష ప్రోత్సాహం అందుతుంది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, ఆర్పీలకు శిక్షణ అందించాం. సద్వినియోగం చేసుకోవాలి. – రాము, డీఈవో

పాఠశాలలో నీటి వసతి, టాయిలెట్స్‌, విద్యార్థుల చేతుల శుభ్రత, వారి ప్రవర్తన, చేపడుతున్న కార్యక్రమాల నిర్వహణ, హరితహారం కింద మొక్కలు, ప్రకృతి, పర్యావరణం వంటి అంశాలపై రేటింగ్‌ ఇస్తారు. దీంట్లో అత్యధికంగా రేటింగ్‌ వచ్చిన పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపుతోపాటు, ప్రోత్సాహం అందనుంది. ఫైవ్‌స్టార్‌ వస్తే ఎక్స్‌లెంట్‌, ఫోర్‌స్టార్స్‌ వస్తే వెరిగుడ్‌, త్రీస్టార్‌ వస్తే గుడ్‌, టూస్టార్స్‌ వస్తే నీడ్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌, వన్‌స్టార్‌ వస్తే పూర్‌గా ఉన్నట్లు గుర్తిస్తారు. ఇందులో నీటి వసతికి 22 పాయింట్లు, వాటిని వినియోగించుకునే విధానానికి 27, చేతులు కడుక్కునే విధానానికి 14, పాఠశాలలో చేపట్టే కార్యక్రమాలకు 21, ప్రవర్తన, సామర్థ్యం నిర్మాణానికి 20, ప్రకృతి పర్యావరణానికి సంబంధించి 20 పాయింట్లు ఉంటాయి. మొత్తం 125 పాయింట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో జిల్లా నుంచి 8 నుంచి 10 పాఠశాలలను ఎంపిక చేయనున్నారు.

పాఠశాలలకు రేటింగ్స్‌1
1/1

పాఠశాలలకు రేటింగ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement