
నాకు నీడగా.. నీకు తోడుగా..
● ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ ● ఎక్కడున్నా రాఖీని మరువని రక్త సంబంధాలు ● మార్కెట్లో పండుగ సందడి
కలెక్టర్‌కు పోషణ బంధం రాఖీ
63 ఏళ్లుగా పండుగ సంతోషం..
సోదరి కోసం సౌదీ నుంచి..
అన్నంటే ధైర్యం.. తమ్ముడంటే ప్రేమ.. అమ్మగర్భాన్ని పంచుకుని.. నాన్న చూపిన బాటలో నడుచుకుని.. ఏళ్లకాలం తోడునీడగా నిలిచేది సోదర, సోదరీమణుల బంధం. రక్తం పంచుకుని పుట్టి.. చివరి అంకం వరకు ప్రేమ, ఆప్యాయతలు పంచుకునే ప్రేమబంధం. ఇలాంటి బంధానికి ప్రతీకగా నిలుస్తోంది రాఖీ పండుగ. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా అంటూ.. అన్నా.. తమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు కట్టేది రక్షాబంధన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు బట్వాడా చేస్తుండగా.. మరికొందరు పండక్కి స్వదేశానికి వచ్చేశారు. కొందరు వృద్ధులు శుక్రవారం నుంచే సోదరుల ఇళ్లకు పయనమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో పండుగ రద్దీ కనిపిస్తుండగా.. మార్కెట్లలో వివిధ డిజైన్లలతో రాఖీలు మెరుస్తున్నాయి. స్వీట్ల దుకాణాల్లో వివిధ రకాల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేడు రాఖీ పండుగ సందర్భంగా కథనం..
మరిన్ని కథనాలు 8లో..
పెద్దపల్లిరూరల్: కలెక్టర్ కోయ శ్రీహర్షకు శుక్రవారం పెద్దపల్లి సీడీపీవో కవిత పోషణ బంధం రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పోషణ రాఖీలు తయారు చేయించి జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేశామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు విధిగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఇళ్లకు వెళ్లి రాఖీ కట్టి పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 15 వేల ఇళ్లకు వెళ్లి ఇలా అవగాహన కల్పిస్తారని వివరించారు.
ఇల్లంతకుంట: చిత్రంలో కనిపిస్తున్న వీరు సార మల్లేశం, అంతటి లక్ష్మి. అక్కా తమ్ముళ్లు. సొంతూరు ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు. ముగ్గురు మగపిల్లలు. అంతటి లక్ష్మి అన్న నర్సయ్య ఐదేళ్లక్రితం చనిపోయాడు. ప్రతీ రాఖీ పండక్కి అక్క లక్ష్మినర్సవ్వతో కలిసి అంతటి లక్ష్మి ముస్కానిపేటకు నడుచుకుంటూ వెళ్లి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టేవారు. ప్రస్తుతం ముగ్గురూ ఇల్లంతకుంటలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ‘మా తమ్ముడు మల్లేశానికి నేను మా అక్క ప్రతీ ఏటా రాఖీ కడతాం. తమ్ముడికి రాఖీ కడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. 63ఏళ్లుగా రాఖీ కడుతున్నా. ఆరోజు మా ఇళ్లంతా పండుగ వాతావరణం ఉంటుంది. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం’ అని అంతటి లక్ష్మి తెలిపింది.
16 ఏళ్లుగా స్పీడ్ పోస్ట్‌లో..
జమ్మికుంట: చిన్నతనం నుంచి తన చేతులతో రాఖీ కట్టించుకున్న సోదరుడు ఇప్పుడు సప్తసముద్రాల అవతల ఉన్నా రాఖీ పంపించడం మరవడం లేదు ఆ సోదరి. అమెరికాలో స్థిరపడిన సోదరుడికి 16ఏళ్లుగా ఇంటర్‌నేషనల్ స్పీడ్‌పోస్టు ద్వారా రాఖీ పంపుతోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సుజాతకు ఇద్దరు సోదరులు పొనగంటి సంపత్, రమేశ్ ఉన్నారు. సంపత్ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. రమేశ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా జీవనం సాగిస్తున్నాడు. సుజాత ఏటా రాఖీ పండుగ సందర్భంగా 15రోజుల ముందుగానే రమేశ్‌కు ఇంటర్ నేషనల్ స్పీడ్‌పోస్ట్ ద్వారా రాఖీ పంపిస్తోంది. పండుగ రోజున రమేశ్ రాఖీ కట్టుకొని ఫోన్ ద్వారా సుజాతతో మాట్లాడి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.
కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన బీమనాతి శ్రీధర్ ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా స్వదేశానికి రాలేదు. రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి మౌనికతో రాఖీ కట్టించుకోవాలని అనిపించింది. గల్ఫ్ దేశంలో కంపెనీ యజమానితో విషయం చెప్పాడు. వారు ఒప్పుకోవడంతో బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. సోదరితో రాఖీ కట్టించుకుంటే ఆ సంతోషం వర్ణించలేనిదని శ్రీధర్ అంటున్నాడు.

నాకు నీడగా.. నీకు తోడుగా..

నాకు నీడగా.. నీకు తోడుగా..

నాకు నీడగా.. నీకు తోడుగా..

నాకు నీడగా.. నీకు తోడుగా..