క్రిప్టోకు రెక్కలు! | - | Sakshi
Sakshi News home page

క్రిప్టోకు రెక్కలు!

Aug 9 2025 5:49 AM | Updated on Aug 9 2025 5:49 AM

క్రిప

క్రిప్టోకు రెక్కలు!

దేశం దాటుతున్న రూ.వందల కోట్లు
● మూడేళ్ల క్రితమే కేంద్రం హెచ్చరికలు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● తాజాగా నెక్ట్స్‌ బిట్‌ పేరుతో రూ.300 కోట్ల టోకరా? ● గతంలో రెక్సిట్‌, మెటా పేరుతో రూ.కోట్ల దందాలు ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పెట్టుబడి పెడుతున్న అత్యాశపరులు ● క్రిప్టో వసూళ్లపై రాచకొండ పోలీసుల ఉక్కుపాదం ● కరీంనగర్‌లో రెవెన్యూ, పోలీసులవే అధిక పెట్టుబడులు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

‘క్రిప్టోలో ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. ప్రతీ రోజూ సాయంత్రానికి మీ ఖాతాల్లో రూ.వేలు చూసుకోండి. నెలకు రూ.లక్షల సంపాదన. రెండుమూడు నెలల్లో మీ జీవితం మారిపోతుంది, హోదా పెరుగుతుంది’ అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి.. అమాయకుల నుంచి రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఒకరిద్దరికి సరిగానే ఇచ్చి.. మిగిలిన వారికి టోకరా వేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బులు రూ.వందల కోట్లు దేశం దాటుతున్నాయి. క్రిప్టో పేరిట తెలంగాణలో పలు నకిలీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయని, అమాయకులు పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారని మూడేళ్ల క్రితమే కేంద్ర నిఽఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను హెచ్చరించాయి. ఈ తరహా యాప్‌లను రాష్ట్ర పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక క్రిప్టో మోసాలకు వేదికవుతున్నా.. పోలీసులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యాప్‌లలో పెట్టుబడులు పెట్టడం శోచనీయం.

దేశం దాటుతున్న రూ.వందల కోట్లు

భారీగా లాభాలు ఆశ చూపి, వసూలు చేసిన మొత్తాన్ని జగిత్యాల కేంద్రంగా కొంచెం హవాలా మార్గంలో, క్రిప్టోలోకి కొంచెం మార్చి దేశం దాటిస్తున్నారు. విదేశాల్లో ఆస్తులు కొని, వ్యాపారాలు ప్రారంభించి అక్కడే స్థిరపడేలా ‘లక్కీ భాస్కర్‌’సినిమాను తలపించేలా భారీ స్కెచ్‌ వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జీబీఆర్‌ క్రిప్టో కరెన్సీ పేరుతో రమేశ్‌గౌడ్‌ అనే వ్యక్తి ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే రూ.95 కోట్లు కొల్లగొట్టాడు. దీనిపై సీఐడీ విచారణ జరపుతోంది. ఇందులో లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై ఓ డీఎస్పీని అటాచ్‌ చేశారు. రమేశ్‌ గౌడ్‌ ఆ డబ్బును దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టి, పదేళ్ల గోల్డెన్‌ వీసా సంపాదించినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల మెటా ఫండ్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై వసూలు చేసిన లోకేశ్‌, కె.సతీశ్‌ ఆ డబ్బును దేశం దాటించారని, వీరికి ఓ బీజేపీ నాయకుడు సాయం చేశాడన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి లోకేశ్‌ ఎప్పుడో థాయ్‌లాండ్‌ వెళ్లాడని బాధితులు చెబుతున్నారు. తాజాగా హిమాన్ష్‌ అనే యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. ఇతను రాష్ట్రవ్యాప్తంగా 400 మంది వద్ద రూ.19 కోట్లు నెక్ట్స్‌బిట్‌ యాప్‌ పేరుతో వసూలు చేశాడని రాచకొండ పరిధిలోని మేడిపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ యాప్‌ బారిన పడ్డవారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావారే. గతంలోనూ హిమాన్షు రిక్సో యాప్‌ను నిర్వహించి రూ.కోట్లలో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ముఠా దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం.

పట్టించుకోని కరీంనగర్‌ పోలీసులు

నెక్ట్స్‌బిట్‌ యాప్‌పై రహస్య సమాచారం మేరకు రాచకొండ పోలీసులు ఆగస్టు 1వ తేదీన హిమాన్షును అరెస్టు చేశారు. ఈ కేసులో రికీఫామ్‌ (ఫారిన్‌ ఆపరేటర్‌), అశోక్‌ శర్మ (థాయ్‌లాండ్‌ ఆపరేటర్‌), డీజే సొహైల్‌ (రీజనల్‌ రిక్రూటర్‌), మోహన్‌ (సహాయకుడు), అశోక్‌కుమార్‌ సింగ్‌ (హిమాన్షుకు సహాయకుడు)ను నిందితులుగా చూపించారు. వీరంతా నెక్ట్స్‌ బిట్‌యాప్‌లో పెట్టుబడి పెట్టించి ప్రజలను మోసగించారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలో రామగుండం, కరీంనగర్‌ కమిషనరేట్లు, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. రాచకొండ పోలీసుల తరహాలో వీరూ చర్యలకు దిగితే రూ.వందల కోట్ల దందా బయటికి వస్తుందని బాధితులు అంటున్నారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసుస్టేషన్లలో ఈ విషయమై ఫిర్యాదులు ఇస్తే సెటిల్‌మెంట్‌ చేసుకోండని తిప్పి పంపుతున్నారని, కేసులు నమోదు చేయకుండా నిందితుల వైపు ఉంటున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కేసులు ఎందుకు నమోదు చేయడం లేదంటే బాధితులు ముందుకు రావడం లేదని పోలీసులు సమాధానం ఇస్తున్నారు.

క్రిప్టోకు రెక్కలు!1
1/1

క్రిప్టోకు రెక్కలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement