
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని కాశెట్టివాడలో గురువారం కురిసిన భారీ వర్షంతో డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి చేరి కాలనీవాసులను తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించి సాయంత్రం అధికారులతో కలిసి డ్రైనేజీని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పట్టణంలో నీటి నిల్వలు లేకుండా, మురికినీరు గోదావరిలో కలవకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తదితరులున్నారు.
రాత్రివేళ యూరియా పంపిణీ
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని కల్లూర్ రోడ్ పీఏసీఎస్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు యూరియా పంపిణీ చేశారు. ఒక్కో ఎకరానికి ఒకటి చొప్పున బస్తాలు రైతులకు అందించారు. మధ్యాహ్నమే యూరియా పంపిణీ ప్రారంభించామని, రైతుల వేలిముద్రలు తీసుకోవడంలో ఆలస్యంతో పాటు కౌలు రైతులు ఓటీపీ వివరాలు చెప్పాల్సి ఉండటంతో పంపిణీ ఆలస్యం అయినట్లు పీఏసీఎస్ కార్యదర్శి బుచ్చయ్య తెలిపారు. యూరియా కోసం రాత్రి వరకు వేచి ఉండటం ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లు ఆమోదించకపోవడం అన్యాయం
జగిత్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బీజీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపితే నెలల తరబడి ఆమోదించకుండా తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో మాట్లాడారు. సామాజిక న్యాయం అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డిని అనుమతించకపోవడం కేవలం ముఖ్యమంత్రినే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.1500కోట్ల నిధులు కోల్పేయే పరిస్థితి ఉందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసిన బిజేపీ ప్రభుత్వం బలహీనవర్గాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అమలు కాదన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఇకనైనా 50శాతం సీలింగ్ తొలగించి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజంగి నందయ్య, దర రమేశ్, చందా రాధాకిషన్, జున్ను రాజేందర్, శేఖర్, మన్సూర్ తదితరులు ఉన్నారు.
వరద కాలువలో రైతుల పూజలు
కథలాపూర్(వేములవాడ): వరదకాలువలోకి నీరు వదలడంతో కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామశివారులోని కాలువలో శుక్రవారం రైతులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రజాప్రతినిధులకు విన్నవించగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో ఎస్సారెస్పీ నుంచి వరదకాలువలోకి నీరు వదిలారని రైతులు తెలిపారు. ఏఎంసీ డైరెక్టర్ కారపు గంగాధర్, విండో డైరెక్టర్ మార్గం శ్రీనివాస్, నాయకులు లైసెట్టి గణేశ్, అంజాగౌడ్, లవకుమార్, రాజేశం, ప్రభు, లక్ష్మణ్ పాల్గొన్నారు.

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి