
ఇసుక రీచ్ వద్దే వద్దు
● ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చిన ఆత్మకూర్ గ్రామస్తులు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): సామాన్య ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగు ఇసుక రీచ్ విషయంలో మరోమారు వివాదం తలెత్తింది. ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఇసుక తీసేందుకు నవంబర్ 2024లో ప్రభుత్వం రీచ్ పాయింట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో సుమారు 5,550 మెట్రిక్ టన్నుల ఇసుక తీసే వీలుందని అధికారులు గుర్తించారు. ఇందులో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఇతరాత్ర అసరాలకు దాదాపు 1,500 మెట్రిక్ టన్నుల ఇసుకకు అనుమతులు ఇచ్చారు. మిగతా 4,050 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో కథలాపూర్ మండలం కలిగోట ప్రాంతంలో నిర్మించే సూరమ్మ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఇసుక అవరముండగా ఉన్నతాధికారులు 2,500 క్యూబిక్ మీటర్ల ఇసుకకు అనుమతులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అనుమతులు వారం క్రితమే వచ్చినా విషయం బయటికి రాలేదు. గురువారం ఒక్కసారిగా వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. శుక్రవారం 150 మందికి పైగా మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చి రీచ్ రద్దు చేయాలని ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.