
230 పడకల ఆస్పత్రికి రూ.203 కోట్లు
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్: జిల్లా కేంద్రంలో నూతనంగా 230 పడకల ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణ శివారులోని పార్టీ కార్యాలయంలో 88 మంది లబ్ధిదారులకు రూ.36.66 లక్షల విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. జగిత్యాలకు మెడికల్ కళాశాల మంజూరు చేసుకుని రాష్ట్రంలోనే మొదటి అనుమతి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికే మంజూరయ్యాయని వివరించారు. మెడికల్ కళాశాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రూ.20 కోట్లు మంజూరు చేశారన్నారు. నూకపల్లిలో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధుల మంజూరుతో లబ్ధి చేకూరుతుందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్లు దామోదర్‌రావు, నక్కల రాధ రవీందర్‌రెడ్డి, నాయకులు బాలె శంకర్, గోలి శ్రీనివాస్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.