పల్లైవెద్యం.. ఆరోగ్యం భద్రం | - | Sakshi
Sakshi News home page

పల్లైవెద్యం.. ఆరోగ్యం భద్రం

Jul 17 2025 3:28 AM | Updated on Jul 17 2025 3:28 AM

పల్లైవెద్యం.. ఆరోగ్యం భద్రం

పల్లైవెద్యం.. ఆరోగ్యం భద్రం

మెట్‌పల్లి రూరల్‌: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఉచితంగా సేవలు అందుతుండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఒక్కో కేంద్రానికి ప్రతిరోజు సగటున 25 నుంచి 40 మందికి పైగా ప్రజలు వస్తున్నారు. ఈ కేంద్రాలతో దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాయని, ఆర్థిక భారం తగ్గిందని గ్రామీణులు చెబుతున్నారు.

14 రకాల వైద్య పరీక్షలు..

106 రకాల మందులు

ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో పలు రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. మెట్‌పల్లి మండలంలో 23 గ్రామాలు ఉన్నాయి. ఇందులో వేంపేట, వెల్లుల, మెట్లచిట్టాపూర్‌, కొండ్రికర్ల, ఆత్మకూర్‌ గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు వైద్య సేవల కోసం చుట్టుపక్క గ్రామ ప్రజలు కూడా వస్తున్నారు. రక్తం, మూత్ర పరీక్షలతోపాటు మరో 14 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు.ర్యాపిడ్‌ కిట్ల ద్వారా అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు.. ఫలితాన్ని వెంటనే చెబుతున్నారు. నిర్ధారణ అయిన రోగానికి చికిత్స అందిస్తూ.. 106 రకాల మందులు ఇస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటున్నారు. గతంలో ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు మాత్రమే ఉండేవారు. 2022–23 ఈ కేంద్రాలను ప్రభుత్వం ఆప్‌గ్రేడ్‌ చేసి వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు వైద్యులను నియమించింది. ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, నర్సింగ్‌ ఆఫీసర్ల్‌ను కేంద్రాలకు పంపించింది. ప్రస్తుతం వారంతా కేంద్రాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నారు.

ఎన్‌క్వాస్‌ గుర్తింపు

గతంలో మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌ ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపు (నేషనల్‌ క్వాలిటీ ఎష్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌–ఎన్‌క్వాస్‌) వరించింది. వైద్య సేవలు, పరిశుభ్రత, పచ్చదనం, రోగుల సంతృప్తి స్థాయి, ఆసుపత్రికి వచ్చే వారి పట్ల సిబ్బంది మెలిగే తీరు, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై కేంద్ర బృందం ఆరా తీసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా 84 శాతం గ్రేడ్‌ పాయింట్ల చోటు కల్పించింది.

సొంత భవనాలు పూర్తయితే మేలు..

ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాలకు పలుచోట్ల సొంత భవనాలు లేక ఇతర భవనాల్లో నిర్వహిస్తున్నారు. నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. పనుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త భవన నిర్మాణాలు పూర్తయితే మరిన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు వైద్య సేవలను పెంచవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సేవలు

ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, నర్సింగ్‌ వైద్యులు

ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు పంపిణీ

సేవలపై సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement