
పోచమ్మకు బోనాలు
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలో మేరు సంఘం మహిళలు బుధవారం పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. శోభాయాత్రలో పోతురాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మేరు సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌కు కుక్కలు
మెట్‌పల్లి: పట్టణంలోని 19, 24, 26వార్డుల్లో బుధవారం యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కలను పట్టుకున్నారు. సుమారు 20కుక్కలకు ఏడో వార్డులో ఉన్న యానిమిల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌కు తరలించారు. అక్కడి వాటికి శస్త్ర చికిత్స చేయించి తిరిగి వదిలిపెడుతామని ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ విష్ణు తెలిపారు. కుక్కల నియంత్రణలో భాగంగా నెలరోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పండ్ల తోటలపై ఆసక్తి పెంచుకోవాలి
ధర్మపురి: రైతులు వరికి ప్రత్యామ్నాయంగా పండ్ల తోటలపై ఆసక్తి పెంచుకోవాలని డీఆర్డీవో రఘునందన్ అన్నారు. మండలంలోని జైన, మగ్గిడి గ్రామాల్లో బుధవారం పర్యటించారు. రెవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్లను పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను ఎంచుకోవాలన్నారు. వడ్డీలేని రుణాలపై అవగాహన కల్పించాలని, మహిళాసంఘాల సభ్యులు వా టిని వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఎంపీడీవో రవీందర్, ఏపీవో సుజన్, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
222 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 222 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఉపాధ్యాయులు లేని చోట కొత్తవారిని నియమించామని డీఈవో రాము తెలిపారు. కొంతమంది పోస్టింగ్ ఉన్న చోటే ఉంటామని, తాము వెళ్లలేమని చెప్పినట్లు తెలిసింది. అనారోగ్య కారణాలతో కొందరు సర్దుబాటును వ్యతిరేకిస్తున్నారని సమాచారం.
27న జగిత్యాలకు మంద కృష్ణ
జగిత్యాలటౌన్: ఆసరా పింఛన్లు పెంచాలనే డిమాండ్‌తో ఆగస్టు 13న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేసే లక్ష్యంతో ఈనెల 27న జిల్లా కేంద్రంలో సన్నాహక సదస్సు ఉంటుందని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హాజరు కానున్నారని జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం తెలిపారు. సదస్సును విజయవంతం చేయాలని వికలాంగులను కలిసి ఆహ్వానించారు.

పోచమ్మకు బోనాలు