
ప్రత్యామ్నాయ లైన్లతో.. విద్యుత్ సమస్యకు చెక్
● నాలుగు గ్రామాలకు తీరనున్న విద్యుత్ సమస్య ● నేరెళ్ల నుంచి రూ.53 లక్షలతో పనులు ● 11 కిలోమీటర్ల 33 కేవీ విద్యుత్తు లైన్ ఏర్పాటు ● లక్ష్మీదేవిపల్లి రోడ్డు వెంట పాత లైన్‌పునరుద్ధరణ
సారంగాపూర్: మండలకేంద్రంతోపాటు.. పోతా రం, బట్టపల్లి, నాయికపుగూడెం గ్రామాలకు 40 ఏళ్లక్రితమే విద్యుత్ సౌకర్యం ఉంది. అయితే చిన్నపాటి వర్షం పడినా.. గాలివీచినా సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. అటవీప్రాంతం కావడంతో విద్యుత్ పునరుద్ధరణకు చాలా సమయం పడుతోంది. దీనిని అధిగమించడానికి విద్యుత్ అధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు గ్రామాల సమస్య తీర్చడానికి ప్రస్తుతం ఉన్న రెండు 33 కేవీ లైన్లకు అదనంగా మరో రెండు లైన్లు వేస్తున్నారు.
● మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి.
● సారంగాపూర్, లక్ష్మీదేవిపల్లి, రేచపల్లి గ్రామాల్లో 33 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి.
● సారంగాపూర్ సబ్‌స్టేషన్ కింద సారంగాపూర్, నాయికపుగూడెం, పోతారం, బట్టపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతోంది.
● జగిత్యాల మండలం పొలాస మీదుగా తిప్పన్నపేట, హైదర్‌పల్లి నుంచి సారంగాపూర్, రేచపల్లి, లక్ష్మీదేవిపల్లి సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
● సారంగాపూర్‌లోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు వచ్చే లైన్ మూడు కిలోమీటర్ల మేర పూర్తిగా అటవీప్రాంతంలో ఉంది.
● వానవచ్చినా.. ఈదురుగాలులు వీచినా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అటవీప్రాంతంలో లైన్లు తెగిపోతున్నాయి.
● విద్యుత్ వైర్లపై చెట్లు పడి స్తంభాలు విరిగిపోతున్నాయి.
● విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ సిబ్బంది రాత్రి పూట ఇబ్బంది పడుతున్నారు.
● ఇలా గంటల తరబడి వర్షంలో శ్రమించాల్సి వస్తోంది.
● ఏటా వర్షాకాలం, వేసవిలో ఈ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది.
ప్రత్యామ్నాయ లైన్లతో చెక్
● సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, నాయికపుగూడెం గ్రామాలకు విద్యుత్ సమస్య ఉండకూడదన్న ఆలచోనతో ఆ శాఖ రూ.53లక్షలతో ధర్మపురి మండలం నేరెళ్ల నుంచి సారంగాపూర్ సబ్‌స్టేషన్‌కు అదనంగా మరో 33 కేవీ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదించింది.
● మూడు నెలల క్రితం పనులు ప్రారంభించింది.
● 11 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న 33 కేవీ లైన్ నేరెళ్ల నుంచి నేరుగా సారంగాపూర్ సబ్‌స్టేషన్‌కు చేరుతుంది.
● విద్యుత్ శాఖ కన్‌స్ట్రక్షన్ డీఈఈ ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతూ.. పూర్తి కావచ్చాయి.
● ఈ నెలఖరులోగా నేరెళ్ల లైన్‌కు కనెక్షన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు..
మూడో లైన్ పునరుద్ధరణ..
● నేరెళ్ల నుంచి కొత్త లైన్ నిర్మాణం పూర్తికాగా.. లక్ష్మీదేవిపల్లి నుంచి సారంగాపూర్‌కు రోడ్డు వెంట గతంలో వేసిన పాత లైన్‌ను పునరుద్ధరిస్తున్నారు.
● దీని ద్వారా సారంగాపూర్ సబ్‌స్టేషన్‌కు మూడు లైన్లు సిద్ధమవుతున్నాయి.
● నాలుగు గ్రామాలకు ఏ ఒక్కక్షణం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.