
భగీరథ నీటి సరఫరా నిలిపివేత
● వెంకట్రావ్‌పేట వద్ద పగిలిన పైపు ● వారం రోజులుగా అక్కడ లీకేజీలు ● మరమ్మతు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం
మెట్‌పల్లి: పట్టణంలోని వెంకట్రావ్‌పేట వద్ద జాతీయ రహదారి పక్కనున్న మిషన్ భగీరథ పైపు గురువారం పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథాగా పోయింది. వారం క్రితం అక్కడ లీకేజీలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి మరమ్మతు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతూ వస్తున్నారు. తాజాగా పైపు ఒక్కసారిగా పగలడంతో నీరు జాతీయ రహదారి మీదుగా దిగువన ఉన్న ఖాళీ స్థలాల్లోకి భారీగా వచ్చి చేరింది. రోడ్డుపై నీటి ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. నీటి ఉధృతి తగ్గిన తర్వాత రాకపోకలు కొనసాగాయి. సంఘటనా స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మోహన్, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. ప్రధాన పైపులైన్ పగలడంతో శుక్రవారం నుంచి జిల్లాకు నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.

భగీరథ నీటి సరఫరా నిలిపివేత