
నిధుల గోల్‌మాల్‌పై పదేళ్లుగా పోరాటం
● ప్రజావాణిలోనూ దొరకని పరిష్కారం ● రికవరీ కోసం అధికారుల చుట్టూ ఒకేఒక్కడు
జగిత్యాలటౌన్: సుమారు పదకొండేళ్ల క్రితం.. 2014లో గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి మేజర్ గ్రామపంచాయతీ(ప్రస్తుతం మున్సిపాలిటీ)లో రూ.పదిలక్షల నిధులు పక్కదారి పట్టాయని, దీనిపై విచారణ చేయాలని అదే పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ అజ్మత్ అలీ అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. పలుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, నామమాత్రంగా విచారణ చేస్తూ.. నిందితులకు అండగా నిలుస్తూ.. కలెక్టర్‌ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని, కలెక్టర్ చొరవ తీసుకుని నిధుల గోల్‌మాల్‌పై చర్యలు తీసుకోవాలని అలీ కోరుతున్నాడు. అలీ కథనం ప్రకారం.. 2014లో గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురిలో నిర్వహించిన వేడుకలకు శానిటేషన్ ఖర్చులకంటూ ప్రభుత్వం రూ.పదిలక్షల సర్పంచ్ పేరిట విడుదల చేసింది. సదరు డీడీని పంచాయతీ బీఆర్‌జీఎఫ్ ఖాతాలో జమచేసింది. సర్పంచ్ కుమారుడు సంగి రాజశేఖర్ పేరున రూ.5.49లక్షలు, మిగిలిన నిధులు మరో నలుగురి పేరిట డ్రా అయ్యాయి. ఆడిట్ రిపోర్టులో అధికారులు అభ్యంతరకర ఖర్చుగా తేల్చారు. ఆ నిధుల లెక్క తేల్చాలంటూ అజ్మత్‌అలీ 2015లోనే అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. నాటి నుంచి నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని డీపీవో, ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు.
పొసగని లెక్కలు..
సరిపోని రికార్డులు
రూ.పది లక్షల వినియోగంపై రికార్డులో పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆడిట్ అధికారుల నివేదిక చెబుతోంది. క్యాష్‌బుక్‌లో నమోదు చేసినవిధంగా ఓచర్లు, బిల్లులు, చెల్లింపుల రశీదులు, ఎంబీ రికార్డులు లభ్యం కాలేదంటున్న ఆడిట్ అధికారుల అభ్యంతరాలు నిధులు పక్కదారి పట్టాయనే అజ్మత్‌అలీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. సంగి రాజశేఖర్ పేరిట రూ.5.49 లక్షలు చెల్లించడం అనుమానాలకు తావిస్తోంది. ఆధారాలు, ఆరోపణలతో అలీ అధికారులకు ఫిర్యాదు చేసినా అప్పుడు ఇప్పుడు అన్నారని, తాజాగా అవినీతే జరగాలేదని అంటున్నారని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.