
ప్రమాదం జరిగినప్పుడే హడావుడి
కోరుట్ల: ఈ రెండు సందర్భాల్లోనూ ట్రాన్స్‌కో అధికారులు సంఘటన జరిగిన సమయంలో చూపిన హడావుడి ఆ తరువాత చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాపాయ స్థితి ఉంటేనే ట్రాన్స్‌కో అధికారులు పరిష్కారంపై దృష్టి పెడతారా..? అన్న అనుమానంతో జనం ఆందోళన చెందుతున్నారు.
హడావుడితో సరి..
ఏడాదిన్నర క్రితం కరెంటు షాక్‌తో ఇద్దరు చిన్నారులు గాయపడిన వెంటనే ట్రాన్స్‌కో అధికారులు వారంపాటు హడావుడి చేశారు. ముప్‌పై ఏళ్లుగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లను తొలగిస్తామని ప్రకటించారు. సదరు హైటెన్షన్ వైర్ల తొలగింపు కోసం రూ.50 లక్షలు కేటాయించాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ఆ నిధులు రాకపోవడంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. బీమునిదుబ్బ, ప్రకాశం రోడ్ ఏరియాలను కలుపుతూ సుమారు 150 ఇళ్లపై నుంచి హైటెన్షన్ వైర్లు యధాతథంగా ఉన్నాయి. ఇప్పటికీ అ ప్రాంతజనం వర్షాకాలం వస్తే చాలు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
తాత్కాలిక మరమ్మతులు
ఆదివారం కరెంట్ షాక్‌కు కారణమైన వల్లంపల్లి 33 కేవీ లైన్ వేలాడుతున్న విషయాన్ని ఇదివరకు స్థాని కులు చాలామంది ట్రాన్స్‌కో అఽధికారుల దృష్టికి తీసుకెళ్నిట్లు సమాచారం. ఆ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ 33 కేవీలైన్ స్తంభాలు మార్చి 11 మీటర్ల ఎత్తు ఉన్న స్తంభాలు వేయాలని ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించినట్లు తెల్సింది. ఈ వినతులకు స్పందించి ట్రాన్స్‌కో అధికారులు అప్పుడే టవర్లు వేసి సరిదిద్దే ప్రయత్నం చేయగా.. స్థానికులు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిసింది. అయితే ట్రాన్స్‌కో అధికారులు టవర్ల ఏర్పాటులో చొరవ చూపకపోవడంతో 33 కేవీ లైన్లు అలాగే ఉండిపోయాయి. ప్రమాదం జరగగానే ట్రాన్స్‌కో అధికారులు హడావుడిగా మంగళవారం ప్రమాదస్థలంలో కొత్త స్తంభం వేసి లైన్ ఎత్తు పెంచారు. అనంతరం గతంలో ప్రమాదం చోటు చేసుకున్న కల్లూర్ రోడ్ ఏరియాలోని హైటెన్షన్ వైర్లను పరిశీలించి పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపామని స్థానికులకు చెప్ప డం గమనార్హం. ఇటీవల కరెంట్ ప్రమాదం జరిగిన చోట టవర్లు ఏర్పాటు చేస్తామని, పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ వైర్లు వేలాడు తూ, ప్రమాదకరంగా ఉంటే వెంటనే తమ సిబ్బంది దృష్టికి తేవాలని ట్రాన్స్‌కో ఏడీఈ రఘుపతి తెలిపా రు. కల్లూర్‌రోడ్‌లోనూ ప్రమాదకరంగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లు సరిచేసేందుకు త్వరలో 11 మీటర్ల ఎత్తు ఉన్న స్తంభాలు వేయిస్తామన్నారు.
ఆ తర్వాత మర్చిపోతున్న విద్యుత్ అధికారులు తాజాగా కోరుట్ల ప్రమాద స్థలంలో కొత్త స్తంభాలు
ఏడాదిన్నర క్రితం కోరుట్లలోని భీమునిదుబ్బ కల్లూర్‌రోడ్‌లో గాలిపటం ఎగరేస్తున్న ఇద్దరు చిన్నారులు 33 కేవీ లైన్ విద్యుత్‌షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి అవిటివాడయ్యాడు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.
ఐదు రోజుల క్రితం కోరుట్ల–మెట్‌పల్లి జాతీయ రహదారి వెంబడి 33 కేవీ లైన్ స్తంభం తక్కువ ఎత్తులో ఉండటంతో తయారీలో ఉన్న గణపతి విగ్రహాన్ని తరలిస్తున్న పది మందికి షాక్ తగిలింది. వీరిలో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఆరుగురు తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.