
వైద్య కళాశాల నిలిచేనా!?
● వసతులపై ఎన్‌ఎంసీ అసంతృప్తి ● అసంపూర్తిగా కళాశాల భవనాలు ● 27 ఎకరాల్లో కళాశాల నిర్మాణానికి నిర్ణయం ● గదులు, హాస్టల్‌కు రూ.115 కోట్లు మంజూరు ● బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపేసిన కాంట్రాక్టర్
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలపై జాతీయ వైద్య కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం కళాశాలలో మూడో బ్యాచ్ కొనసాగుతోంది. నాలుగో బ్యాచ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇబ్బందికరంగా మారింది. కళాశాలలో వసతులు లేవని, విద్యార్థులకు సరిపడా రోగులు, ప్రాక్టికల్స్‌కు అవసరమైన మృతదేహాలు లేవంటూ పెదవి విరవడంతో కళా శాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జగి త్యాలకు 2020లో వైద్య కళాశాల మంజూరైంది. దీనికి ధరూర్ క్యాంప్‌లో 27 ఎకరాల స్థలాన్ని కేటా యించారు. ప్రస్తుతం క్యాంపులో ఉన్న ఆగ్రోస్ గోదాముల్లో తరగతి గదులను ఏర్పాటు చేశారు. రూ.14 కోట్ల వ్యయంతో రెనోవేషన్ చేపట్టి తరగతి గదుల్లో వసతులు కల్పించారు. మొదటి సంవత్సరం ఎన్‌ఎంసీ (జాతీయ మెడికల్ కమిషన్) సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే యూజీఎంఎస్‌ఆర్ 2023 నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాలలో వసతులు, అధ్యాపకులు, విద్యార్థులకు సంబంధించిన బయోమెట్రిక్ హాజరు, ప్రాక్టీస్‌కు సంబంధించిన మృతదేహాలు, ఇతర పరికరాలు, సీసీ టీవీలన్నింటిని ఎన్‌ఎంసీ పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో కొత్తగా ఏర్పడిన 27 క ళా శాలల్లో ఎన్‌ఎంసీకి అనుగుణంగా వసతులు లేవని తేలింది. ఇందులో మన వైద్య కళాశాల కూడా ఉంది.
విద్యార్థులకూ ఇబ్బందులే
2022లో తరగతులు ప్రారంభం కాగా.. ప్రస్తుతం మూడో సంవత్సరం బ్యాచ్ కొనసాగుతోంది. మరి కొద్ది రోజుల్లో నాలుగో సంవత్సరం బ్యాచ్ ప్రారంభం కానుంది. భవన నిర్మాణాలకు సంబంధించి పనులు పూర్తి కాకపోవడంతో గోదాముల్లోని గదుల్లోనే బోధన కొనసాగుతోంది. హాస్టల్‌లో వసతులు అంతంతగానే ఉన్నాయి. ప్రస్తుతం బాయ్ హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతోంది. గర్‌ల్స్ హాస్టల్ మాత్రం నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే సంబంధించి కళాశాలకు నోటీసులు జారీ చేశారు. వైద్య కళాశాల అధికారులు ఇక్కడున్న సదుపాయాల గురించి వివరణ ఇచ్చి న ట్లు తెలిసింది. జిల్లాకేంద్రంలో 300 కు పైగా బెడ్స్ ఆస్పత్రి పాతబ స్టాండ్ వద్ద ఉండగా.. మాతాశిశు సంక్షేమ కేంద్రం ధరూర్ క్యాంప్‌లో ఉంది. వీ టికి సంబంధించిన వైద్యులు ఉన్నప్పటికీ వసతుల్లోనే కొంత అ సంతృప్తి వ్యక్తమవుతోంది. మరోసారి జాతీయ వైద్య కమిషన్ తనిఖీ చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసేలా చ ర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ కమిషన్ సంతృప్తి చెందకపోతే వైద్య కళాశాల మనుగడ ఇబ్బందిగా మారుతుంది.
ఇబ్బందులు లేవు
వైద్య కళాశాలలో అన్ని వసతులున్నాయి. సిబ్బంది కూడా ఉన్నారు. భవన నిర్మాణాలు త్వరలో పూర్తి కానున్నాయి. ఎన్‌ఎంసీ వారికి రిపోర్టులు ఇచ్చాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేవు.
– ఖాద్రి, వైద్య కళాశాల ప్రిన్సిపల్
ఎక్కడి పనులు అక్కడే..
27 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాల భవనం, హాస్టల్ నిర్మాణానికి రూ.115 కోట్లు మంజూరయ్యా యి. ఇప్పటివరకు రూ.65కోట్ల పనులు చేపట్టగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. కళాశాల భవనం స్లాబ్, గోడలు మాత్రమే పూర్తయ్యాయి. అలాగే బాయ్స్, గర్‌ల్స్ హాస్టల్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలో వైద్య విధాన కమిషన్ పరిశీలించి వసతులు లేవ ని, ఇబ్బందులున్నాయని పేర్కొనడం గమనార్హం.

వైద్య కళాశాల నిలిచేనా!?