
రైతు ఖాతాల్లోకి ‘రైతు భరోసా’
● జిల్లాలో అర్హులు 2.48 లక్షలు ● ఎకరాకు రూ.6వేల చొప్పున జమ ● 1,79,820 మంది రైతుల ఖాతాలో రూ.120 కోట్లు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 1,79,820 మంది రైతులకు రూ.120,67,49,510 వారివారి ఖాతాల్లో జమయ్యాయి. వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో 2,48,550 మంది రైతులు ఇప్పటి వరకు అర్హత సాధించారు. వీరి వివరాలను ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపించింది. గుట్టలు, చెరువులు, వాణిజ్య అవసరాలకు వినియోగించే భూములు మినహాయించి రైతులందరికీ పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది.
జిల్లా రైతులకు రూ.251.14 కోట్లు
జిల్లా రైతులకు వారివారి బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా కింద రూ.251,14,131,31 జమ కానున్నాయి. గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని 2018లో ప్రారంభించగా.. ఆ సమయంలో 1,91,459 మంది రైతులు రూ.164. 47కోట్లు మాత్రమే పొందారు. భూ రికార్డులు సరి చేసుకోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా అందించడం వంటివి చేయడంతో ప్రస్తుతం వారి సంఖ్య 2.48 లక్షలకు చేరింది. ఆయా రైతులకు అందే పెట్టుబడి సాయం కూడా రూ.251.14 కోట్లకు పెరిగింది.