
పొగాకు నిర్మూలిద్దాం
● విచ్చలవిడిగా తంబాకు, గుట్కా వినియోగం ● బహిరంగంగానే ధూమపానం ● పెరుగుతున్న సిగరేట్లు కాల్చే వారి సంఖ్య ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
కరీంనగర్‌టౌన్: యువత ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. సిగరేట్ కాలినట్లే తమ ఆరోగ్యం కాలిపోతుందనే విషయం గమనించలేకపోతున్నారు. జిల్లాలో యుక్తవయస్సు వచ్చిన విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సిగరేట్, బీడీ, తంబాకు, జర్ధా, గుట్కా వంటి మత్తు పొగాకు మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదాగా మొదలు పెట్టి చివరకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటి వల్ల వివిధ రకాల రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నా తినేవారిలో మార్పు రావడం లేదు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కథనం.
బహిరంగ ధూమపానం నేరం
ధూమపానం నష్టాన్ని గుర్తించిన పాలకులు 2003లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని చట్టం తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ప్రయాణ ప్రాంగణాలు, పార్కులు, రోడ్లపై, సినిమా థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే చట్టరీత్యా చర్యలతో పాటు జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అలాంటి కేసులు నమోదు కావడం లేదు. సిగరేట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని ప్యాకెట్లపై ముద్రించి వదిలేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్ అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.