
వైద్యులూ.. నిర్లక్ష్యం వద్దు
● ఉత్తర తెలంగాణలో జగిత్యాల కీలకం ● వైద్యపరంగా జిల్లాను బలోపేతం చేస్తాం ● వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ● కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం
జగిత్యాల: రోగులకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉత్తర తెలంగాణకు జగిత్యాల జిల్లా కీలకమని, జిల్లాను వైద్యపరంగా బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టరేట్‌లో ఆదివారం వైద్యశాఖాధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ఆస్పత్రులకు అవసరమైన వైద్యపరికరాలు సమకూరుస్తామని, జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కాన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లు ఉన్నాయని, వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వందశాతం ప్రసవాలు చేయాలన్నారు. సిజేరియన్‌లు చేయడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, సాధారణ ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జిల్లాకేంద్ర ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌కు మరమ్మతు చేయాలని, నూకపల్లి వద్ద రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలని కోరారు. మెడికల్ కళాశాల విద్యార్థులకు మూడు బస్సులు మంజూరు చేయాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్.లత, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఖాద్రి, ఆస్పత్రి సూపరిటెండెంట్ సుమన్‌రావు పాల్గొన్నారు.
వాగ్దానాలు దశలవారీగా నెరవేరుస్తాం
ధర్మపురి: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యకళాశాల్లో వసతులు కల్పిస్తామని మంత్రి రాజనర్సింహ అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి జయంత్యోత్సవాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రి, హెచ్‌ఆర్ సిబ్బంది మధ్య అవగాహన లేక నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో అన్ని శాఖల్లో 56వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. విమర్శలు రాకుండా ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్నారు. రాష్ట్రంలో మొదటి విడత 24 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి మాట్లాడుతూ ధర్మపురిలోని మాతాశిశు సంక్షేమ ఆస్పత్రికి రూ.1.50 కోట్లు కేటాయించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరు చేసిన గత ప్రభుత్వం.. సిబ్బందిని నియమించలేదని, వైద్య పరికరాలు అందించలేకపోయిందన్నారు. ట్రామా సెంటర్ కోసం పాశిగామ వద్ద 200 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామన్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఎస్.దినేష్, వేముల రాజు తదితరులున్నారు.
ఆస్పత్రుల్లో అసంపూర్తి పనులు పూర్తి చేయించండి
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కోరుట్లలో వంద పడకల ఏరియా ఆసుపత్రి పూర్తయి నెలలు గడుస్తోందని, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, పరికరాలు, సిబ్బందిని సమకూర్చాలని, మెట్‌పల్లిలో భవనం త్వరితగతిన పూర్తి చేయించాలని కోరారు. కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల విన్నవించారు.
రాయికల్ ఆస్పత్రి సమస్యలపై వినతి
రాయికల్: పట్టణంలోని ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్ పరిధిలోకి చేర్చినా.. సదుపాయాలు లేవని మంత్రికి పట్టణ,మండల కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సరిపడా వైద్యులు లేరని, పరికరాలు సమకూర్చి వసతులు కల్పించాలని కోరారు. పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేశ్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, కొయ్యడి మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య పాల్గొన్నారు.

వైద్యులూ.. నిర్లక్ష్యం వద్దు