
ఉద్యాన పంటల సాగుకు ఊతం
కథలాపూర్(వేములవాడ): ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ మేరకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అమలు చేస్తున్నాయి. రైతులకు భారీగా రాయితీలు ఇచ్చి ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యానవనశాఖ ఆయా పంటల సాగుపై వార్షికి ప్రణాళిక ఖరారు చేసింది. జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆయిల్‌పామ్: ఈ ఏడాది 3,750 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఎకరాకు ఏటా రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు సబ్సిడీ అందించనున్నారు.
మైక్రో ఇరిగేషన్: ఉద్యానవన పంటలు సాగు చేయడానికి డ్రిప్, స్ప్రింక్లర్లు సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. ఆయిల్‌పాం సాగుకు 3,750 ఎకరాలు, పసుపు, మిరప, కూరగాయలు పంటల సాగుకు 987 ఎకరాలు, పండ్ల తోటలకు 248 ఎకరాలు లక్ష్యంగా కేటాయించారు
రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం: ఈ పథకం ద్వారా తీగజాతి కూరగాయలు సాగు చేసుకునే రైతులకు అర ఎకరంలో తక్కువ ఖర్చుతో రూ. లక్షతో శాశ్వత పందిరి నిర్మించుకుంటే ఉద్యానవనశాఖ ద్వారా రూ.50 వేలు సబ్సిడీ ఉంటుంది. జిల్లాకు ఇవి 50 యూనిట్లు కేటాయించారు.
జాతీయ వెదురు పథకం: పంట చేనుల గట్ల వెంబడి వెదురు మొక్కలు నాటే రైతులకు రెండేళ్లవరకు నిర్వాహణ ఖర్చు చెల్లిస్తారు. మొదటి సంవత్సరం మొక్కకు రూ.90 చొప్పున, రెండో సంవత్సరం మొ క్కకు రూ.60 చొప్పున చెల్లిస్తారు. జిల్లాకు వెయ్యి మొక్కలు నాటించాలన్నది లక్ష్యం. ఇవే కాకుండా రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పథకం ద్వారా డ్రాగన్ ప్రూట్, మామిడి, బొప్పాయి, నిమ్మ, జామ, దాని మ్మ, బత్తాయి, పసుపు, అల్లం తదితర పంటలు సాగుకు జిల్లాకు 500 యూనిట్లు కేటాయించారు.
సబ్సిడీ అందించనున్న ప్రభుత్వం
జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో సాగు
లక్ష్యం చేరుతామంటున్న అధికారులు
ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోండి
ఆసక్తిగల రైతులు ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పట్టాదారు పాసుబుక్, ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే కోరుట్ల, జగిత్యాల డివిజన్ ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదించాలి.
– శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి

ఉద్యాన పంటల సాగుకు ఊతం