
మాట్లాడుతున్న కలెక్టర్ యాస్మిన్ బాషా
● గడువు ముగిసినా నిర్లక్ష్యమేనా? ● ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ మండిపాటు ● అసంపూర్తిగా ‘మన ఊరు– మన బడి’ పనులు
కథలాపూర్(వేములవాడ): ‘మన ఊరు– మనబడి’ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడం, వాటిపైనే రంగులు వేయించడంపై కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. మంగళవారం సిరికొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు– మన బడి’ పనులను ఆమె తనిఖీ చేశారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్ల గదులకు పెయింటింగ్ వేయించడం, విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా మరుగుదొడ్లు ఎందుకు నిర్మించలేదని ఇంజినీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులను కలెక్టర్ మందలించారు. పాఠశాల ఆవరణలో రాళ్లు, సిమెంట్ వస్తువులు చిందరగా పడవేయడంతో విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి రుచిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ హైస్కూల్‌లోని ఓ తరగతి గదిని పరిశీలించి గోడలపై చెత్త ఉండటాన్ని చూసి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాలను సొంత ఇంటిగా భావించాలని, అప్పుడే పాఠశాలలు బలోపేతమవుతాయని అన్నారు. తరగతి గదులు అపరిశుభ్రంగా ఉండటంపై ఎంఈవోతోపాటు, హెచ్‌ఎంకు మెమో జారీ చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహి ళ, కంటి వెలుగు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కోరారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. భూషణరావుపేటలో కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. రోజూ కనీసం 200 మందికి కంటి పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఏడురోజుల శిబిరంలో 1,250 మందికి కంటి పరీక్షలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మకరంద్, ఆర్డీవో వినోద్‌కుమార్, జిల్లా వైద్యాధికారి శ్రీధర్, నీటిపారుదల శాఖ ఈఈ ప్రకాశ్‌రావు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, డీఎల్పీవో శంకర్, వైద్యశాఖ జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఎండీ సమియొద్దీన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో జనార్దన్, ఎంఈవో ఆనందరావు, వైద్యాధికారి సింధూజ తదితరులు పాల్గొన్నారు.
వందశాతం వసూలు లక్ష్యం
జగిత్యాల: మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మున్సిపల్ అధికారులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతీ మున్సిపాలిటీలో 100 శాతం పన్ను వసూలు చేయాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సుందరీకరణ, అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ కమిషన్ బోనగిరి నరేశ్, డీఈ రాజేశ్వర్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి..
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. స్థానిక గాంధీనగర్ మహిళ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, మహిళల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ మకరంద్, డీఎం అండ్ హెచ్‌వో శ్రీధర్ పాల్గొన్నారు.
పకడ్బందీగా కంటి వెలుగు పరీక్షలు
కోరుట్ల: జిల్లాలో కంటి వెలుగు పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ యాసి్‌మ్‌న్ బాషా అన్నారు. స్థానిక తొమ్మిదో వార్డులో చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో 261 కంటి వెలుగు శిబిరాలు పూర్తయ్యాయన్నారు. గ్రామాల్లో సర్పంచులు, పట్టణాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ల సాయంతో వీటిని విజయవంతగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 47,691 రీడింగ్ గ్లాసులు అందించామన్నారు. 62శాతం లక్ష్యం పూర్తయిందని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మకరంద, మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నం లావణ్య, కమిషనర్ ఎండీ ఆయాజ్, ఆర్డీవో నవీన్ కుమార్ పాల్గొన్నారు.