కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ మారుతి నిలయంలోని అద్దె గదిలో ఓ భక్తురాలు మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా ధర్మారాజుపల్లికి చెందిన భక్తురాలు తన కుటుంబంతో కలిసి కొండగట్టుకు వచ్చింది. ఆలయంపై హారతి పట్టేందుకు మూడు రోజులుగా మారుతి నిలయంలోని 4వ నంబర్ గదిని అద్దెకు తీసుకొని, ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం హారతి పట్టి, స్వామివారిని దర్శించుకొని, గదికి వెళ్లారు. అకస్మాత్తుగా సదరు భక్తురాలికి శ్వాస ఆడకపోవడంతో కుటుంబసభ్యులు కొండపై డాక్టర్ కోసం వెతికారు. కానీ కాసేపటికే ఆమె చనిపోయింది. హోంగార్డులు అక్కడికి చేరుకొని, ఆటోను పిలిపించి, వారిని స్వగ్రామం పంపించారు. అర్చకులకు సమాచారం అందించగా ఆలయాన్ని శుభ్రం చేసి, సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభించారు. దాదాపుగా గంటసేపు భక్తురాలు ఇబ్బంది పడి మృతిచెందిందని భక్తులు తెలిపారు. కొండపై ప్రథమ చికిత్స కేంద్రం ఉన్నా అక్కడున్నవారు సమయానికి స్పందించలేదన్నారు. సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే బతికేదని పేర్కొన్నారు.