
నిరసన దీక్షలో నాయకులు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు
జగిత్యాలటౌన్: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యుడైన రాష్ట్రమంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. టీస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌ను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. సత్యనారాయణరావు మాట్లాడుతూ, గ్రూప్ –1 అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.లక్ష పరిహారం చెల్లించాలన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒకేఒక గ్రూప్– 1 నోటిఫికేషన్ జారీఅయ్యిందని, ప్రశ్నపత్రాలు లీక్ కావడం అభ్యర్థులకు శాపంగా మారిందని అన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులను క్షోభకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు భోగ శ్రావణి, పన్నాల సరిత, వీరబత్తిన అనిల్‌కుమార్, మదన్‌మోహన్, ఆముద రాజు తదితరులు పాల్గొన్నారు.