చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు
తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు
50 శాతానికి పైగా ఓట్లతో జయకేతనం
అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి షాక్
ట్రంప్ మద్దతిచ్చిన ఆండ్రూ కుమోకు పరాభవం
న్యూయార్క్: భారతీయ–అమెరికన్, డెమొక్రటిక్ పార్టీ నేత జొహ్రాన్ మమ్దాని(34) చరిత్ర సృష్టించారు. ప్రపంచ వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్ నగర మేయర్‌గా ఘన విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మతస్థుడిగా, దక్షిణాసియా మూలాలున్న తొలి వ్యక్తిగా, అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డుకెక్కారు. మంగళవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకురాలు, పంజాబీ హిందూ మీరా నాయర్ కుమారుడైన మమ్దాని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మాజీ గవర్నర్, స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ కుమో, రిపబ్లికన్ నామినీ కురి్టస్ స్లివాను సునాయాసంగా ఓడించారు. 50 శాతానికి పైగా ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. ట్రంప్ అండతో బరిలోకి దిగిన ఆండ్రూ కుమో ఓటమి పాలయ్యారు.
ఆయనకు 41 శాతం ఓట్లే లభించాయి. కురి్టస్ స్లివాకు కేవలం ఏడు శాతం ఓట్లు రావడం గమనార్హం. మమ్దాని అధ్యక్షుడిగా ఎన్నికైతే న్యూయార్క్‌కు కనీస అవసరాలకు సరిపడినంత మాత్రమే నిధులు కేటాయిస్తానని ట్రంప్ ప్రకటించారు. పైగా మమ్దాని కమ్యూనిస్టు అని, ఆయనకు ఓటు వేయొద్దని ప్రజలకు స్వయంగా విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ జనం మమ్దానికి పట్టం కట్టారు. దాదాపు 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, మమ్దానికి 10,36,051(50.4 శాతం), కుమోకు 8,54,995 (41.6 శాతం), స్లివాకు 1,46,137 (7 శాతం) ఓట్లు లభించాయి.
111వ ప్రథమ పౌరుడు
జొహ్రాన్ మమ్దాని వచ్చే ఏడాది జనవరిలో న్యూయార్క్ 111వ ప్రథమ పౌరుడిగా బాధ్య తలు చేపట్టబోతున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ముస్లిం యువకుడు నెగ్గడం అమెరికన్ల ఆలోచనాధోరణిలో వస్తున్న మార్పునకు ప్రతీక అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ప్రజాగ్రహానికి ఉదాహరణ అని అంచనా వేస్తున్నారు. ప్రగతిశీల రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారని చెబుతున్నారు. మరోవైపు వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ ఎన్నికల్లోనూ డెమొక్రటిక్ అభ్యర్థులే విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ అభ్యర్థులకు పరాభవం ఎదురైంది.


