మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ!

Young people face higher health risks from alcohol than older adults - Sakshi

వాషింగ్టన్‌:  మద్యపానంతో వయసు మళ్లిన వారితో పోలిస్తే యువతకే అనారోగ్య ముప్పు ఎక్కువట! మద్యం సేవనంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నిపుణుల పరిశోధన ఫలితాలను లాన్సెట్‌ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించారు. 15–39 ఏళ్ల వారిలో ఆల్కహాల్‌ వల్ల ఆరోగ్యానికి రిస్క్‌ అధికంగా ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 40 ఏళ్లు దాటి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు పరిమితంగా మద్యం తీసుకుంటే కార్డియో వాస్క్యులర్‌ జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్‌ వంటి సమస్యలు తగ్గుతున్నట్లు వెల్లడయ్యింది.

ఒకటి నుంచి రెండు పెగ్గులకే పరిమితం అయితే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. 15–39 ఏళ్ల పురుషులు ఆల్కహాల్‌ సేవిస్తే ఆరోగ్యపరంగా నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చిచెబుతున్నారు. మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటి ఘటనల్లో బాధితులుగా మారుతున్నది ఎక్కువ శాతం 15–39 ఏళ్ల వయసు విభాగంలో ఉన్నవారేనని గుర్తుచేస్తున్నారు. ‘‘మేమిచ్చే సందేశం ఏమిటంటే.. యువత మద్యం జోలికి అస్సలు వెళ్లొద్దు. 40 ఏళ్లు దాటినవారు చాలాపరిమితంగా మద్యం తీసుకోవచ్చు. దానివల్ల వారికి ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలున్నాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ప్రొఫెసర్‌ ఎమ్మానుయేల్‌ గాకిడౌ చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top