World Lion Day: అడవిలో బతకకున్నా అడవికి రారాజే.. ఎందుకో తెలుసా?

World Lion Day 2021 Interesting Facts About Lions In Telugu - Sakshi

World Lion Day 2021: ఎంత మాంసాన్ని ఇష్టంగా లాగించే వాళ్లైనా.. సింగిల్‌ మీల్‌లో అదీ 40 కేజీల మాంసం తినగలరా? అనే అనుమానం రావొచ్చు. మనుషులకైతే అది అసాధ్యం కాకపోవచ్చు. కానీ, మృగాలకు రారాజుగా పేరున్న సింహానికి అది ఎంతో అలవోకైన పని.. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఎంత ఆకలేసినా.. సింహం గడ్డి తినదనేది సామెత. కానీ, సింహాలు మొక్కల నుంచి తమ దాహం తీర్చుకుంటాయని తెలుసా?. అందుకే కలహారి లాంటి ఎడారుల్లో సైతం సింహాలు మనుగడ కొనసాగించగలవు. టీసమ్మ మెలన్‌ లాంటి మొక్కల నుంచి నీటిని సేకరించుకోగలవు సింహాలు. World Lion Day సందర్భంగా మృగరాజుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..  

సింహం అనేది బలానికి, క్రూరత్వానికి ప్రతీక. ఆఫ్రికా ఖండపు ఔనత్యానికి అదోక గుర్తు.  అలాంటి జీవులు అంతరించిపోయే స్థితికి చేరాయని తెలుసా? ఒకప్పుడు ఆఫ్రికా, ఆసియా, యూరప్‌ వ్యాప్తంగా సింహాలు ఉండేవి. ఇప్పుడు కేవలం ఆఫ్రికాలోనే సింహాలు ఉన్నాయి. అయితే.. గుజరాత్‌ ససన్‌-గిర్‌ నేషనల్‌ పార్క్‌లో ఏషియటిక్‌  సింహాల రక్షణ కోసం కృషి నడుస్తోంది. ఈ పార్క్‌లో సుమారు 350-400 మధ్య  సింహాలు ఉన్నాయి. సరిహద్దులోని గ్రామీణ ప్రాంతాల్లో వీటి సంచారం షరా మాములుగా మారిపోయింది.

కూనలతో గిర్‌ సింహం    

సింహం సింగిల్‌గా వస్తుందనేది ఫేమస్‌ డైలాగ్‌. కానీ, సింహాలు సంఘ జీవులు. ఇవి బతికేది.. వేటాడేదీ(ఒకటి తరిమితే మిగతావి మిగతా వైపుల నుంచి చుట్టుముట్టడం-అంబూష్‌ ఎటాక్‌) గుంపులుగానే. ఒక్కో గుంపులో పదిహేను దాకా సింహాలు ఉంటాయి. గరిష్టంగా 40 దాకా ఉండొచ్చు. మగ సింహాం ఆ గుంపునకు నాయకత్వం వహిస్తుంది. ఆధిప్యత పోరు తర్వాత నాయకత్వ  బాధ్యతను స్వీకరించి సరిహద్దుల్ని కాపాడుతుంది. ఆడ సింహాలు వేటాడతాయి. వేటాడిన మాంసాన్ని ముందుగా ముట్టేవి మగ సింహాలే!.

ఆఫ్రికన్‌ సింహాలు

సింహాలు సిసలైన ఫ్యామిలీమెన్‌లు. గుంపులోని ఒకదానితో ఒకటి తలలు రుద్దుకోవడం, కూనలతో ఆడడం, సింహాలన్నీ ఐక్యంగా ఉండడం లాంటి ఆప్యాయతలు మాత్రం తారాస్థాయిలో ఉంటాయి. ఆడ సింహాలు కూనల్ని కలిసే పెంచుతాయి.  సింహం కూనలు ఏ తల్లి(ఆడ సింహం) నుంచైనా పాలు తాగుతాయి. ‘ఫ్యామిలీ సెంట్‌’తో తమ హద్దులోని సింహాలు కలిసి కట్టుగా బతుకుతుంటాయి కూడా.

గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందనేది కేవలం డైలాగ్‌ మాత్రమే. కానీ, ఒరిజినల్‌గా సింహం నుంచి వచ్చే గర్జన.. సుమారు ఐదు మైళ్ల దూరం దాకా వినబడుతుంది. బిగ్‌ క్యాట్‌ జాతుల్లో గుంపుగా గర్జించేవి సింహాలు మాత్రమే. ఇక రకరకాల సమయాల్లో వాటి కమ్యూనికేషన్‌ రకరకాల శబ్దాలతో ఉంటుంది.

అడవికి రాజనే బిరుదు ఉన్నప్పటికీ.. సింహం బతికేది పచ్చిక బయళ్లు, మైదానాల్లోనే. అడవుల్లో బతకడానికి సింహం అస్సలు ఇష్టపడదు.  సింహాల గురించి చెప్పే క్రమంలో.. ఏదో అతిశయోక్తితో ఆఫ్రికన్లు ఈ పదం పుట్టించారు. సో.. కింగ్‌ ఆఫ్‌ జంగిల్‌ అనేది సహేతుకం కాదేమో!.  ఇక సింహం గంటకు యాభై మైళ్ల వేగంతో పరిగెత్తగలదు. నడిచేటప్పుడు దాని కాలి మడమ నేలను తాకదు.
  
 
చీకట్లో సైతం వేటాడగలిగే సత్తా సింహాల సొంతం. తుపానుల సమయంలో ఉరుముల శబ్దాలకు జంతువులు హడలిపోతుంటే.. ఆ భయాన్ని ఆసరాగా తీసుకుని వేటాడడం సింహాలకు మాత్రమే ఉన్న నైజం. 

ఈ భూమ్మీద సైబీరియన్‌ పెద్దపులి తర్వాత సైజులో పెద్దది సింహమే. మగ సింహం బరువు సగటున 190 కేజీలు, ఆడ సింహం బరువు 126 కేజీల దాకా ఉంటుంది. నాలుగు రోజులకొకసారి నీటిని తాగగలిగే ఓపిక ఉన్న సింహాలు.. దొరికితే రోజూ నీరు తాగుతాయి. కానీ, తిండి లేకుండా మాత్రం ఉండలేవు. తమ శరీరంలో పాతిక శాతం అంటే.. సుమారు 40 కేజీల మాంసాన్ని ఒక్కసారిగా తినేయగలవు ఇవి.

సింహం పళ్లు మాత్రమే కాదు.. నాలుక మీద ఉండే ‘పాపిలే’ అనే పదునైన మచ్చలు ఎముకల నుంచి మాంసాన్ని లాగేయడానికి సాయపడ్తాయి. అలాగే రోజూ ఆకలి తీర్చుకునేందుకు సగటున ఒక మగ సింహానికి 8 కేజీలు, ఆడ సింహానికి ఐదున్నర కేజీల మాంసం అవసరం పడుతుంది. ఏనుగులు, జీబ్రాలు, అడవి దున్నలు మాత్రమే కాదు.. ఎలుకలు, పక్షులు, కుందేళ్లు, తాబేళ్లలాంటి చిన్న జీవులను సైతం వీటి వేటకు బలవుతుంటాయి.
 
 
ఈ భూమ్మీద మిగిలిన సింహాల సంఖ్య 23,000 మాత్రమే(లెక్కల ప్రకారం). ఏనుగులతో పోలిస్తే(4,15,000లకు పైనే) మృగరాజుల సంఖ్య చాలా తక్కువ. చరిత్రలో సింహాల గురించి ఎంతో ప్రశస్తి ఉండేది. మూడు తరాలుగా వీటి సంఖ్య 40 శాతం తగ్గిపోయింది. వాతావరణ మార్పులు,  వేట, పశు సంపదను రక్షించుకునే క్రమంలో సింహాలను ఎక్కువగా చంపేస్తున్నారు.

 

ఇవాళ వరల్డ్‌ లేజీ డే. ఈ సందర్భంగా సింహం రోజులో 20 గంటల దాకా పడుకునేందనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి కదా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top