ప్చ్‌.. ట్రంప్‌ వల్లే కావడం లేదా? | Why Trump Can not Control America Gun Culture | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. ట్రంప్‌ వల్లే కావడం లేదా?

May 6 2026 12:03 PM | Updated on May 6 2026 1:27 PM

Why Trump Can not Control America Gun Culture

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనను తాను పవర్‌ఫుల్‌ లీడర్‌గా చెప్పకుంటారు. ఒక్కో యుద్ధాన్ని ఆపుతూ.. శాంతి ఒప్పందాలు కుదురుస్తూ ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో “శాంతి దూత”గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు.  కానీ, సొంత దేశంలో మాత్రం పరిస్థితులను చక్కదిద్దడం ఆయన వల్ల కావట్లేదు.. 

“నో కింగ్స్‌” నిరసనలు, ఐస్‌ (Immigration and Customs Enforcement) వ్యతిరేక ప్రదర్శనలు ఇందుకు ఉదాహరణలు. ఇవి అమెరికా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. అయితే, ఇవి చాలదన్నట్లు గన్‌ కల్చర్‌ మరింత పేట్రేగిపోవడం మరో తలనొప్పిగా మారింది. క్రమం తప్పకుండా అక్కడ సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండగా.. అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో తమ భద్రతపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చివరికి.. వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం.. అమెరికాలో గన్‌ కల్చర్‌ ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. 

టెక్సాస్‌ కాల్పుల ఘటన దాకా..
అమెరికాలో గన్‌ కల్చర్‌ ఏ రేంజ్‌కు చేరుకుందో తెలుసా?. తాజా టెక్సాస్‌ షూటింగ్‌ ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనతో.. 2026లో ఇప్పటివరకు 130 మాస్‌ షూటింగ్స్‌ ఘటనలు నమోదయ్యాయి. గన్‌ వైలెన్స్‌ ఆర్కైవ్‌ గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నుంచి మే దాకా  4,200 మందికి పైగా మరణాలు, 7,300 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ గణాంకాలు.. అమెరికా సమాజం ఎదుర్కొంటున్న భయానక వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 

షాకింగ్‌ నిర్ణయం..
అమెరికాలో గన్‌ కల్చర్‌ సమస్య కొత్తది కాదు. కానీ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదు. పైగా బ్యాక్‌గ్రౌండ్‌ చెక్స్‌, స్కూల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్స్‌, లోకల్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ట్రైనింగ్‌ వంటి అంశాలకు నిధులు తగ్గించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపోయేలా చేసింది. అమెరికాలో గన్‌ వయలెన్స్‌ వల్ల పిల్లలు, టీనేజర్లు ఎక్కువగా బలవుతున్నారు. అయినప్పటికీ, ట్రంప్‌లో చలనం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.

గన్‌ లాబీ..
అమెరికాలో ఇన్నేళ్లలో గన్‌ కల్చర్‌ కంట్రోల్‌ చేసే ప్రయత్నాలేవీ జరగలేదు. గన్‌ లాబీ ఒత్తిళ్ల కారణంగానే వైట్‌హౌజ్‌ ఈ విషయంలో కఠిన చట్టాలు చేయలేకపోతోందన్న విమర్శ బలంగా వినిపిస్తుంటుంది. నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ (NRA) వంటి సంస్థలు.. గన్‌ తయారీ పరిశ్రమ, అలాగే గన్‌ రైట్స్‌కు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు కలసి ఏర్పడిన వర్గమే ఈ గన్‌ లాబీ. గన్‌ కల్చర్‌కు అడ్డుకట్ట వేసే చట్టాలను అమెరికా కాంగ్రెస్‌ ఎదుటకు తీసుకొచ్చినప్పుడల్లా.. ఈ గ్రూప్‌ తెర మీదకు వచ్చి మోకాలు అడ్డుపెడుతూ ఉంటుంది.  

గన్‌ లేకుంటే ఎలా.. ?
అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం.. ప్రజలకు ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉంటుందని గన్‌ లాబీ వాదిస్తుంటుంది. అలాగే.. తనను తాను రక్షించుకోవడానికి ప్రాణాంతక శక్తిని(తుపాకుల్ని) ఉపయోగించవచ్చనే చట్టాలకూ ఈ లాబీ మద్దతు ఇస్తుంటుంది.

ఎంత పవర్‌ఫుల్‌ అంటే..
1998–2020 మధ్య ప్రో-గన్‌ గ్రూపులు లాబీయింగ్‌ కోసం అమెరికాలో 171.9 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాయి. అందులో ఎన్‌ఆర్‌ఏ కంపెనీ ఒక్కటే 64 మిలియన్‌ డాలర్లు పెట్టింది. అలాగే అమెరికా ఎన్నికలనూ ఈ గ్రూపులు ప్రభావితం చేస్తుంటాయి. 2016లో ట్రంప్‌ ఎన్నికల ప్రచారానికి ఎన్‌ఆర్‌ఏ ఏకంగా 30 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. అలాగే రిపబ్లికన్‌ సెనేటర్లకు మద్దతుగా మరో 20 మిలియన్‌ డాలర్లు పెట్టింది. మనీ పవర్‌తోనే అమెరికా రాజకీయాల్ని ఈ గన్‌ లాబీ శాసించగలుగుతోంది. రిపబ్లికన్లు అయినా.. డెమొక్రాట్లు అయినా ప్రతిపాదించిన గన్‌ కంట్రోల్‌ చట్టాలు ఆమోదం పొందడం కష్టంగా ఉంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement