థర్మో బారిక్‌ బాంబులు కలకలం.. రష్యా ‍ప్రయోగించిందా..? ఏమిటీ బాంబులు?

What Are Thermobaric Weapons And Russia Using Them - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగిస్తోందని అనుమానాలు 

భారీ ఆస్తి, జీవ నష్టం తప్పదని నిపుణుల హెచ్చరిక

అణ్వాయుధాల తర్వాత అంతటి విధ్వంసాన్ని, ప్రాణనష్టాన్ని సృష్టించగల ఆయుధాలు.. థర్మో బారిక్‌ బాంబులు. అటు భారీ ఆస్తి నష్టంతో పాటు, ఇటు పెద్ద ఎత్తున జనహననానికి కారణమయ్యే ఈ బాంబులను తమ నగరాలపై రష్యా ప్రయోగిస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఇంతకీ ఏమిటీ బాంబులు? ఎందుకు అంతగా విధ్వంసం సృష్టిస్తాయి? చూద్దాం...

అత్యధిక నష్టాన్ని కలిగించే ఈ థర్మోబారిక్‌ ఆయుధాల తయారీ 1960లో యూఎస్, సోవియట్‌ పోటాపోటీగా చేపట్టాయి. అప్పటినుంచి అంచెలంచెలుగా వీటిని అభివృద్ధి చేస్తూ వచ్చాయి. 2007లో రష్యా అతిపెద్ద థర్మోబారిక్‌ ఆయుధాన్ని పరీక్షించింది. ఈ ఆయుధం 39.9 టన్నుల పేలుడును సృష్టించింది. వీటి తయారీకి ఒక్కో బాంబుకు దాదాపు 1.6 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతుంది. 2017లో అమెరికా తాలిబన్లపై అఫ్గాన్‌లో ఈ బాంబును ప్రయోగించింది. దీని బరువు 21,600 పౌండ్లు. దీని ప్రయోగంతో దాదాపు వెయ్యి అడుగుల విస్తీర్ణంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. వీటిని వాక్యూం బాంబ్‌ అని, ఏరోసాల్‌ బాంబ్‌ అని, ఫ్యూయల్‌ ఎయిర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ అని వ్యవహరిస్తారు.  

ఉక్రెయిన్‌పై ప్రయోగించారా? 

ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా టీఓఎస్‌1 బురాటినో అనే థర్మోబారిక్‌ రాకెట్‌ సిస్టమ్‌ను వాడినట్లు కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఆయుధాన్ని ఫ్లేమ్‌ త్రోయర్‌ అని కూడా వ్యవహరిస్తారు. రష్యా తమపై వాక్యూమ్‌ బాంబ్‌ను ప్రయోగించిందని ఐరాసలో ఉక్రెయిన్‌ రాయబారి విలేకరులతో ధ్రువీకరించారు. అయితే రష్యా నిజంగా వీటిని ప్రయోగించిందనేందుకు మరే ఇతర అధికారిక ఆధారాలు ఇంతవరకు లభించలేదు. ఈ బాంబులను ప్రయోగించాలని పుతిన్‌ భావిస్తే పరిణామాలు వినాశకరంగా ఉంటాయని అమెరికా మాజీ సైనికాధికారి సర్‌ రిచర్డ్‌ హెచ్చరించారు. వీటివల్ల అమాయకులైన వేలాది మంది చనిపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిప్రయోగంతో పరిసరాల్లోని ప్రజలు చనిపోవడమేకాకుండా దూరంగా ఉన్నవారిలో బయటకు కనిపించని దుష్పరిణామాలుంటాయని చెప్పారు. వీటి ప్రభా వం శ్వాసకోస, హృదయ, జీర్ణకోశ, కేంద్ర నాడీ వ్యవస్థలపై ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇలా పనిచేస్తుంది..

ఆవిరిమేఘాల పేలుడు సూత్రం ఆధారంగా ఈ బాంబులు విధ్వంసం సృష్టిస్తాయి. ఈ బాంబులను ప్రయోగించినప్పుడు తొలుత పదునైన లోహ శకలాలు లేదా రసాయన బిందువులతో కూడిన ఏరోసాల్‌ (గాలి తుంపరలు) ఇంధన మేఘం విడుదలవుతుంది. మేఘంలోని ఏరోసాల్స్‌ పరిసరాల్లోకి వేగంగా వ్యాపిస్తాయి. అనంతరం సంభవించే పేలుడుతో మేఘంలోని ఏరోసాల్స్‌ అన్నీ ఒక్కసారిగా అంటుకుంటాయి. పేలుడు కారణంగా ఉత్పన్నమయ్యే శూన్యంలోకి పరిసరాల్లోని గాలి వేగంగా వస్తుంది, ఇందులోని ఆక్సిజన్‌ ఏరోసాల్స్‌ను మరింత వేగంగా మండిస్తుంది. దీంతో తీవ్రమైన ఉష్ణోగ్రతతో కూడిన విస్ఫోటనం సంభవిస్తుంది. ఈ విస్ఫోటనంతో పరిసరాల్లోని జీవజాలమంతా మాడిపోతుంది, భారీగా ఆస్తి నష్టం సంభవిస్తుంది. 
 – నేషనల్‌ డెస్క్‌, సాక్షి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top