చివరికి మిగిలిందిదీ!

US withdraws from Afghanistan bringing an end to 20-year war - Sakshi

20 ఏళ్ల యుద్ధ ప్రభావం

20 ఏళ్ల పాటు సాగిన ఒక యుద్ధానికి ప్రపంచ పెద్దన్న ముగింపు పలికింది.   2001, సెప్టెంబర్‌ 11 న్యూయార్క్‌లోని ట్విన్‌ టవర్స్‌ను విమానాలతో ఢీకొట్టి కూల్చేసి అల్‌కాయిదా విలయం సృష్టించింది. దాడుల్ని సహించలేని అగ్రరాజ్యం ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తానని ప్రతిజ్ఞ చేసింది.   అందుకోసం అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు యుద్ధం నడిపించింది.   నలుగురు అధ్యక్షులు మారారు. వేలాది సైన్యం బలయ్యారు. కోట్లాది డాలర్లు ఖర్చయ్యాయి.   చివరికి ఏం జరిగింది. తడిసి మోపెడయ్యే ఖర్చుని తట్టుకోలేక తాలిబన్లకే తలొగ్గి వెనక్కి వెళ్లిపోయింది. అసలు ఈ 20 ఏళ్లలో జరిగిందేంటి ?

అమెరికాపై 2001 సెప్టెంబర్‌ 11న జరిగిన దాడులతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉగ్రవాద పంజా దెబ్బ తొలిసారి చూసిన అగ్రరాజ్యం తోకతొక్కిన తాచులా బుసలు కొట్టింది. దాడులు జరిగిన నెల రోజులు కూడా తిరిగిందో లేదో అప్పటి అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ అఫ్గానిస్తాన్‌ను అక్టోబర్‌ 7, 2001న ఆక్రమించారు. దాడులకి కారకుడైన అల్‌కాయిదా ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను వెంటాడి వేటాడి హతమార్చడానికి ఆ దేశానికి పదేళ్లు సమయం పట్టింది. ఆ తర్వాత మరో పదేళ్లు 50 దేశాల బలగాలు దశలవారీగా సహకరించడంతో 20 ఏళ్ల పాటు అఫ్గాన్‌లో తాలిబన్లను ఎదుర్కొంటూ తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపించింది. 2011లో బరాక్‌ ఒబామా హయాంలో అత్యధికంగా లక్షా 40 వేల మంది సంకీర్ణ బలగాలు అఫ్గాన్‌లో ఉన్నాయి. అలుపెరుగని యుద్ధం చేసిన అమెరికా దానికయ్యే వ్యయాన్ని భరించలేక వెనుదిరిగింది.  

ప్రాణ నష్టం

అఫ్గానిస్తాన్‌ని అమెరికా ఆక్రమించిన తర్వాత నేరుగా ప్రత్యక్ష యుద్ధంలో గత 20 ఏళ్ల కాలంలో 2,41,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక పరోక్ష ప్రభావంతో అంటే యుద్ధం కారణంగా ఏర్పడిన కరువు, ఆకలి, వ్యాధులు, గాయాలు వంటి కారణాలతో వేలాది మంది మరణించారు. అఫ్గానిస్తాన్‌కు 2,670 కి.మీ. మేరకు కొండల సరిహద్దుని పాకిస్తాన్‌ పంచుకోవడంతో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడుల్లో ఇరు దేశాలకు ప్రాణనష్టం జరిగింది.

ఖర్చు తడిసిమోపెడు

అఫ్గాన్‌తో యుద్ధం, పునర్ని ర్మాణం పేరిట అమెరికాకు ఖర్చు తడిసిమోపెడైంది. ఈ 20 ఏళ్ల కాలంలో అగ్రరాజ్యం దాదాపుగా 2.26 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని బ్రౌన్‌ యూనివర్సిటీ కాస్ట్స్‌ ఆఫ్‌ వార్‌ ప్రాజెక్టు అంచనా వేసింది.  అమెరికా రక్షణ బడ్జెట్‌ నుంచి 93,300 కోట్ల డాలర్లు కేటాయిస్తే, అదనంగా మరో 44,300 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ఈ యుద్ధం కోసం విపరీతంగా అప్పులు చేసిన అమెరికా వడ్డీలే వందల కోట్ల డాలర్లలో కడుతోంది. అమెరికాలో ఎన్నో తరాలపై ఈ యుద్ధానికి సంబంధించిన ఆర్థిక భారం పడనుంది.

అఫ్గాన్‌ ఎలా ఉందంటే..

అఫ్గానిస్తాన్‌లో 2001లో తాలిబన్‌ అరాచక పాలనకు తెరపడిన తర్వాత పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు వచ్చినప్పటికీ చాలా అంశాల్లో మిగతా దేశాలతో పోల్చి చూస్తే వెనుకబడే ఉంది. విద్య, ఆరోగ్యం, మహిళా హక్కులు మెరుగుపడ్డాయి. ప్రజల సగటు ఆయుఃప్రమాణం 56 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెరిగింది. ప్రసవ సమయంలో మహిళల మరణాలు బాగా తగ్గాయి. పార్లమెంటు దిగువ సభలో 27 శాతం సీట్లు మహిళలకి రిజర్వ్‌ చేశారు. అయినప్పటికీ మహిళల అభ్యున్నతిలో ప్రపంచ దేశాల్లో దిగువ స్థానంలోనే ఉంది. 2019 యునిసెఫ్‌ లెక్కల ప్రకారం 37 లక్షల మంది పిల్లలు బడి ముఖం చూడకపోతే వారిలో 60 శాతం మంది ఆడపిల్లలే ఉన్నారు. విద్యనభ్యసిస్తున్న టీనేజ్‌ అమ్మాయిలు 37 శాతం మంది మాత్రమే ఉన్నారు.

2005లో 22% మంది ప్రజలకే విద్యుత్‌ సౌకర్యం ఉంటే, 2019 నాటికి 98% జనాభాకి విద్యుత్‌ వెలుగులు ప్రసరించాయి.  2016 సంవత్సరం నాటికి 54.5% మంది నిరుపేదలు కాగా, నిరుద్యోగం రేటు 8.84%గా ఉంది. ఈ 20 ఏళ్ల కాలంలో 27 లక్షల మంది అఫ్గాన్‌ పౌరులు పొరుగున ఉన్న పాకిస్తాన్, ఇరాన్‌లలో తలదాచుకున్నారు. మరో 40 లక్షల మంది ఆ దేశంలోనే చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు. అఫ్గానిస్తాన్‌ ఇప్పటికీ పిల్లలకి నరకప్రాయంగా ఉంది. 2010–20 మధ్యలో జరిగిన దాడుల్లో  3,219 మంది మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక అదే సమయంలో 7,792 మంది పసిపిల్లలు మృతి చెందారు. అమెరికా వైమానిక దళం అంచనాల ప్రకారం 2013–2019 మధ్య అఫ్గాన్‌పై అమెరికా వేల సార్లు వైమానిక దాడులు జరిపింది. 27 వేల బాంబుల్ని జారవిడిచింది.

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top