
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక, తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco rubio) ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్ (India)తో తక్షణం చర్చలు జరపాలని సూచనలు చేసినట్టు చెప్పుకొచ్చారు.
వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడినట్లు విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. భారత్, పాక్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని రూబియో పాక్‌కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించినట్లు వెల్లడించింది.
మరోవైపు.. ఇటీవల రూబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు.
US secy of State Marco Rubio calls Pak FM Ishaq Dar and Army Chief Gen Asim Munir. Urged Pak and India to de-escalate, offered US assistance in starting constructive talks to avoid future conflicts.
Dar told Geo News that he told Mr Rubio Pak is ready to talk if India stop its… pic.twitter.com/OFSXe7Qe31— Azhar Abbas (@AzharAbbas3) May 10, 2025
అంతకుముందు.. భారత్-పాక్ మధ్య జరిగే యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. జేడీ వాన్స్ మాట్లాడుతూ.. భారత్, పాక్ ఆయుధాలు వదిలేయాలని అమెరికా చెప్పదు. కానీ, దీనికి ఉన్న ఏకైక మార్గం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే. మేము దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. ఇరుదేశాల మధ్య ఘర్షణలు అణు సంఘర్షణగా మారకూడదని మా ఆశ. యుద్ధం వినాశకరమైంది. అందుకే రెండు దేశాలు సంయమనం పాటించాలి’ అని అన్నారు.
ఇదిలా ఉండగా.. భారత్-పాక్‌లు సంయమనం పాటించాలని జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. పహల్గాం ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. భారత్-పాక్‌లలోని పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని, శాంతి స్థాపన కోసం ఇరు దేశాలు చర్చలు జరపాలని ప్రతిపాదించాయి.