అమెరికాలో షట్‌డౌన్ ప్రభావం
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌తో అగ్రరాజ్యంలో గత నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 62,100 కోట్లు) సంపద ఆవిరైపోయింది. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీవో) అంచనాల ప్రకారం ఈ గణాంకాలు అక్టోబర్ 1న షట్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నాలుగు వారాలకు సంబంధించినవి. కాగా ఇదే తీరు కొనసాగితే ఆరు వారాలకు 11 బిలియన్ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం ఏర్పడవచ్చని సీబీవో అంచనా వేసింది. పది లక్షల మంది పైగా ఉద్యోగులకు జీతభత్యాలు లేకపోవడం వల్ల షట్‌డౌన్ సమయంలో వస్తువులు, సరీ్వసుల కొనుగోళ్లు పడిపోతాయని పేర్కొంది.
షట్‌డౌన్ ఎత్తివేత అనంతరం స్థూల దేశీయోత్పత్తి నెమ్మదిగా తిరిగి కోలుకున్నా, నష్టపోయిన సంపద మాత్రం ఇక రికవర్ కాదని పేర్కొంది. కీలకమైన బిల్లులకు సంబంధించి అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య రాజీ కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతబడింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. 1976 నుంచి దాదాపు 10 సార్లు షట్‌డౌన్ పరిస్థితి ఎదురైంది. 2018 డిసెంబర్ 22 నుంచి 2019 జనవరి 25 వరకు 35 రోజుల పాటు సాగిన షట్‌డౌన్ అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం మూతబడినప్పుడు, నిధులు లేకపోవడం వల్ల, కొన్ని ముఖ్యమైన విభాగాలు తప్ప, కీలకం కాని ఫెడరల్ సర్వీసులన్నీ నిలిచిపోతాయి.


